గ్రామీణ ప్రజల్లో చిరునవ్వు చూడడమే ధ్యేయం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:08 AM
మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలను చిరునవ్వుతో చూడడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక , గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
- మంత్రి వివేక్‌వెంకటస్వామి
భీమారం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలను చిరునవ్వుతో చూడడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక , గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో గెర్రగూడెం ప్రాంతంలోని రూ. 4.40 కోట్లతో బూరుగుపల్లి నుంచి నర్సింగాపూర్ మీదుగా ఖాజీపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సర్పంచులు, నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ నీళ్లు పైపులకే పరిమితం అయ్యాయని ఇప్పటికి ప్రజలకు గొంతు తడవని పరిస్థితి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. గూడు లేని వారకి గూడు కల్పించడానికి ప్రభుత్వం ఇం దిరమ్మ ఇళ్లను ఇస్తుందన్నారు. అర్హులైన వారందరికి ఇళ్లు వస్తాయన్నారు. కాగా పలు వురు మంత్రికి సమస్యలను విన్నవించగా పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. నర్సింగాపూర్, ఖాజీపల్లి మధ్యలో ఉన్న గోత్రాలగూడెం ఉంటుందని వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపగా రూ. 1.60 కోట్ల పీఆర్ నిధులతో రోడ్లను నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలంపల్లి చెరువు కట్ట వెడల్పు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మంత్రికి తెలుపగా స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చెరువు కట్టను వెడల్పు చేయాలని సూచించారు. మంత్రి పర్యటన సందర్భంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్ సదానందం, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. బూరుగుపల్లి, నర్సింగాపూర్, దాంపూర్, చేగొండ, కాజిపల్లి సర్పంచులు మల్లేష్, పెద్దల రూప, కొమురయ్య, కొండ శ్యామల పాల్గొన్నారు.