ప్రజా ప్రయోజనాలే లక్ష్యం..
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:09 AM
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేలు
సిరిసిల్ల, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేలు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు సిరిసిల్ల చేనేత చౌక్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో జిల్లాలో అమలుచేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ప్రసంగించారు. స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరులకు నివాళులు తెలుపుతూ ఎందరో అమరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్ ప్రణాళికలు
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, భవిష్యత్ ప్రణాళికల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో 904 అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులు రూ 63.77 కోట్లతో చేపట్టగా, 461పనులు పూర్తి చేశామన్నారు. 179 గ్రామ పంచాయతీ, సామాజిక, పాలశీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణాలకు రూ 10.78 కోట్ల నిధులతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో 113 అభివృద్ధి పనులను రూ.10.88 కోట్లు మంజూరుకాగా, పనులు పురోగతిలో ఉన్నాయని, సీఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ నిధులు రూ 53.90 కోట్లతో 187 రహదారుల అభివృద్ధి, సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నాయని, హైబ్రిడ్ అన్న్యూటీ మోడల్ కింద జిల్లాలోని 44 రోడ్లు 171 కిలోమీటర్ల మేరకు మంజూరైనట్లు తెలిపారు. వేములవాడలో మూలవాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గంభీరావుపేట నుంచి లింగన్నపేట, జిల్లెల్ల క్రాస్‌రోడ్ నుంచి ముస్తాబాద్ వెళ్లే దారిలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, సిరిసిల్లలో కోర్టు భవననాల సముదాయం రూ 81 కోట్లతో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. హెచ్‌ఏఎం కింద జిల్లాలోని 10 మార్గాల్లో 138 కిలోమీటర్ల వరకు రోడ్లు మంజూరైనట్లు తెలిపారు. టీజీఐపాస్ కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.1352 కోట్లతో 813 పరిశ్రమలు ఏర్పాటుచేసి, 9300 మందికి ఉపాధి కల్పించామన్నారు. టీ-ఐడియా, టీ-ప్రైడ్ క్రింద 2384 పరిశ్రమలు, రవాణా వాహనాలకు రూ.103.23 కోట్ల రాయితీగా అందించామన్నారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకం కింద 56 యూనిట్లు రూ 245.63 కోట్ల మార్జిన్ మనీతో వివిధ బ్యాంకుల ద్వారా మంజూరుతో స్థాపించారని తెలిపారు. 156 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 30 భవనాలు పూర్తయినట్లు తెలిపారు. 12మంది పోక్సో బాధితులకు రూ 5 లక్షల పరిహారం అందజేశామరు. జిల్లా పరిధిలో గృహజ్యోతి పథకం కింద మార్చి 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు 25.85 లక్షల జీరో బిల్లులు జారీ చేసి, రూ 99.46 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. జిల్లాలో లో-వోల్టేజిని నివారించేందుకు గతేడాది 223 నియంత్రికలు ఏర్పాటు చేశామని, 2025-26 సంవత్సరానికి 1983, 2026-27 సంవత్సరానికి 1347వ్యవసాయ బావులకు నూతనంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. జిల్లాలో 15 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరుచేయగా, రెండు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. జిల్లాలోని 40 అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుద్ధీకరించామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌లో90 శాతం సబ్సిడీపై 89 ఈవీ ద్విచక్ర వాహనాలు, 70 శాతం సబ్సిడీతో 46 ద్విచక్ర వాహనాలు, 100 శాతం సబ్సిడీపై సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ 10 యూనిట్లు, 70 శాతం పాలిచ్చే పశువులు 49 యూనిట్లు మంజూరి అయినట్లు తెలిపారు.
సిరిసిల్ల నేతన్నలకు 6.22 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు
సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిణీ చేసేందుకు ఏకరూప చీరలు 6 కోట్ల 22 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు 2025లో కేటాయించామన్నారు. ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిలో మొదటి విడతగా 3కోట్ల మీటర్ల ఆర్డర్ సిరిసిల్ల మ్యాక్స్ సంఘాలకు కేటాయించామని, దీని ద్వారా 6 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 214 చేనేత, అనుబంధ కార్మికులు నమోదు చేశామన్నారు. దీనికి ప్రభుత్వ వాటా కింద రూ 2.98 కోట్లు ప్రతీ నెల జమ చేశామన్నారు. నేతన్న భద్రత పథకం కింద 5 వేల 834మంది కార్మికులకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. అకాల మరణం చెందిన మరమగ్గాల, చేనేత పరిశ్రమకు చెందిన 122 మంది కార్మిక కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున రూ 6.10 కోట్లు అందజేశామన్నారు. నేతన్నకు పొడుపు పథకం కింద 2025 కాలానికి జిల్లాలోని 4963మంది కార్మికులకు రూ 12.10 కోట్లు ప్రభుత్వ వాటా కింద విడుదల చేశామన్నారు.
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ. 291కోట్లు మంజూరు..
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఇప్పటివరకు రూ 291 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. బ్రిడ్జి నుంచి ఆలయం వరకు రూ 47 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయని, రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు రూ 111.25 కోట్ల లక్ష్యంతో చేపట్టామని తెలిపారు. రూ.22కోట్లతో చేపట్టిన గుడిచెరువు బండ్ పార్క్ పనులు, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరాయన్నారు. చెరువులో బోటింగ్ కోసం రూ 1.40 కోట్లు మంజూరు కాగా, టెండర్ ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. ఆలయ విస్తరణ పనులు, వీటీఏడీఏ పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ 980 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భీమేశ్వర స్వామి ఆలయం రూ 6 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో రెండో స్థానం
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాలో 6448 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5770 ఇళ్లకు మార్కింగ్ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా, 2720 పూర్తయినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు దశల వారీగా రూ 149 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల నుంచి 933 మంది నిరుపేద లబ్ధిదారులకు రూ 12.57 కోట్ల రుణ సౌకర్యం కల్పించామన్నారు.
యాసంగి సీజన్‌లో 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో నూతనంగా 23 వేల 411 ఆహార భద్రత కార్డుల మంజూరు చేశామని, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో 40వేల23 మంది పేర్లు నూతనంగా నమోదు చేశామన్నారు. రూ 500 గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు లక్షా 3 వేల 487 కుటుంబాలకు బ్యాంక్ ఖాతాల్లో రూ 11.56 కోట్ల సబ్సిడీ సొమ్ము జమ చేశామన్నారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ 136.40 కోట్లు ఆదా..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సాకర్యం అమలు చేస్తున్నామని, జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి మే 2026 వరకు రూ 136.40 కోట్లు మహిళలకు ఆదా జరిగిందని, 4.9 కోట్ల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణించారన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి జిల్లా సమాఖ్య భవనం ప్రారంభానికి సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని లక్షా 802 మంది స్వశక్తి సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసామన్నారు. జిల్లాలోని 8096 సంఘాలకు ఇప్పటివరకు 337సంఘాలకు రూ 40.20 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చామన్నారు. స్త్రీనిధి ద్వారా రూ 5 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చామని, జిల్లాలోని 12 మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇప్పించామన్నారు. జిల్లాలో లక్షా 15 వేల 820 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ 23.34 కోట్ల ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
అదనపు ఆయకట్టు.. సాగుకు ఊపిరి..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9లో భాగంగా శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి మల్కపేట జలాశయం వరకు పనులు పూర్తి కాగా, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ సిస్టం కోసం భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మల్కపేట జలాశయంలో భాగంగా చేపట్టిన ఆరు మట్టికట్టల నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు. కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లోని మెట్ట ప్రాంతాలలోని 10 వేల ఎకరాలకు నీళ్లు అందించడానికి రూపొందించిన ఎత్తిపోతల నిర్మాణ పనులు దాదాపు 50 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. మల్కపేట జలాశయం నుండి సింగసముద్రం వరకు వెళ్లే గ్రావిటీ కాలువ, కుడి కాలువ ద్వారా కోనరావుపేట మరియు ఎల్లారెడ్డిపేట మండలాలకు ఈ యాసంగి సీజన్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ-2, ఫేస్-1లో రుద్రంగి కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి చెరువుల నీటినిల్వ సామర్థ్యం పెంచే పనులు కొనసాగుతున్నాయన్నారు. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్-2 కలికోట సూరమ్మ చెరువు, నాగారం చెరువు దాని సంబంధిత కాల్వల క్రింద 43 వేల 100 ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీస్, కుడి ఎడమ కాలువల సర్వే పనులు పూర్తయ్యాయి. దీంతో జిల్లాలోని 4200 ఎకరాలు ఆయకట్టు సాగులోకి రానుంది. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ -3 కొడిమ్యాల, పోతారం, సూరంపేట, లచ్చపేట, కొత్త చెరువు 450వాటి సంబంధిత కాల్వల కింద గల 58 వేల 800ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీస్, పిల్ల కాల్వల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. దీంతో జిల్లాలో 40 వేల 285 ఎకరాలు సాగులోకి వస్తుందని, ప్రస్తుతం బోయినపల్లి, వేములవాడ రూరల్, వేములవాడ, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని 18వేల 292ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి 192మంది రైతుల కుటుంబాలకు రూ 9.60 కోట్ల బీమా పంపిణీ చేశామన్నారు. రైతు భరోసా కింద వానాకాలం, యాసంగి సీజన్లలో 2 లక్షల 54వేల 832 మంది రైతులకు రూ 251.16 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. 46 వేల 492 మంది రైతులకు రూ 370.75 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. వేములవాడలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రారంభించామని, వేములవాడ రూరల్ మండలం మర్రిపెల్లిలో 40 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 853 రైతులు 2515 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, ఇప్పటివరకు 729 ఎకరాల ద్వారా 660 టన్నుల ఆయిల్ పామ్ దిగుబడి సాధించామన్నారు.
రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్
వేములవాడలో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరయ్యాయన్నారు. జిల్లాకు గత సంవత్సరం 13 పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ఈ సంవత్సరం మరో 48 పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కో పాఠశాలలో ఒక తరగతి గదిలో వసతులు, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ.1.70కోట్లు కేటాయించారన్నారు.
ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం
ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచిందన్నారు. నేషనల్ హెల్త్ మిషిన్ కింద రూ 4.45 కోట్లతో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనులు పూర్తి చేశామన్నారు.
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ కింద డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలతో జరిగే నష్టాలపై వివరించి, కంటి పరీక్షలు చేశామన్నారు. రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశామన్నారు. జిల్లాలోని పలుచోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ ఆర్డీవో ఎస్ బి కుమారి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టాళ్లు.. అలరించిన చిన్నారుల నృత్యం
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అటవీశాఖ, పోలీస్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పౌర సంబంధాల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు స్టాళ్లను పరిశీలించారు. పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆసక్తిగా ఆయుధాలను పరిశీలించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల నృత్యం అలరించింది. పర్యావరణ ఉత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.