Indian Communism: ఎర్రజెండా భవిష్యత్తు ఏమిటి?
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:45 AM
పిల్లల్ని పెద్దవాళ్లు ‘నిండు నూరేళ్లూ వర్ధిల్లు!’ అని ఆశీర్వదిస్తారు. ఒక మనిషి ఈ భూమ్మీద వందేళ్లు జీవించటం అనేది దానికదే ఒక విజయం. కానీ, ఆ ‘అదృష్టం’ ఏ కొందరికో తప్ప అందరికీ లభించదు.
దేశ రాజకీయాల్లో ఒకప్పుడు ఉజ్వల తారగా కమ్యూనిస్టులు
దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన చరిత్ర
చట్టసభల కంటే ప్రజల్లో దేదీప్యమాన స్థానం
అనేక ఉద్యమాలు.. ప్రజల హక్కుల సాధన
యూపీఏ హయాంలో చక్రం తిప్పిన వైనం
2008 అనంతరం వరుస దెబ్బలు
చేజారిన బెంగాల్, త్రిపుర.. మిగిలింది కేరళే
వందేళ్ల సీపీఐ ప్రయాణంలో అనేక మైలురాళ్లు
కొత్త తరానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తే ఇప్పటికీ వామపక్షాలకు అవకాశం
న్యూయార్క్‌లో మమ్దానీ గెలుపే సంకేతం
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పిల్లల్ని పెద్దవాళ్లు ‘నిండు నూరేళ్లూ వర్ధిల్లు!’ అని ఆశీర్వదిస్తారు. ఒక మనిషి ఈ భూమ్మీద వందేళ్లు జీవించటం అనేది దానికదే ఒక విజయం. కానీ, ఆ ‘అదృష్టం’ ఏ కొందరికో తప్ప అందరికీ లభించదు. ఎందుకంటే, జీవితమనే పోరాటంలో ఎన్నో.. ఎన్నెన్నో సవాళ్లు, సంఘర్షణలు.. వాటన్నింటినీ దాటుకొని ఆరోగ్యాన్ని నిలబెట్టుకొని సెంచరీ మైలురాయిని చేరుకోవటం సులభసాధ్యమా? ఒక మనిషి జీవితంలోనే వందేళ్లకు ఇంతటి ప్రాశస్త్యం ఉంటే.. అనేక మంది మనుష్యులు కలిసి పని చేసే ఓ సంస్థ విషయంలోనైతే మరీ కష్టమనే చెప్పాలి. వందేళ్లంటే ఎన్ని తరాలు, ఎంతమంది, ఎన్ని ప్రవాహాలు, ఎన్ని మార్పులు.. వాటన్నింటినీ తట్టుకొని నిలవటం మాటలా? అటువంటి అరుదైన ఫీట్‌ను మన దేశంలో ఇటీవల రెండు సంస్థలు సాధించాయి. ఒకటి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), మరొకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్). 1925లో మొదలైన ఈ రెండు సంస్థల ప్రస్థానం గత సంవత్సరానికే నూరో ఏడాదిలోకి అడుగిడింది. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తర్వాత.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న సంస్థల్లో వందేళ్ల మైలురాయిని చేరుకున్నవి ఈ రెండేనేమో. దేశ రాజకీయాల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులకు ఇవి రెండూ.. రెండు ధ్రువాల్లాంటివి. సైద్ధాంతికంగానూ ఇవి రెండూ ఎన్నటికీ కలవని ధ్రువాలే. వందేళ్లలో ఆర్‌ఎ్‌సఎస్ శాఖోపశాఖలుగా విస్తరించింది. దేశ రాజకీయాల్నే నియంత్రిస్తున్న బీజేపీకి మాతృసంస్థగా ఉంది. తాను సాధించిన విజయాల నేపథ్యంలో వందేళ్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. మరోవైపు, ఒకప్పుడు దేశ రాజకీయాలను ఉర్రూతలూగించిన సీపీఐ, కమ్యూనిస్టు ఉద్యమం నేడు.. ఎటు చూసినా నిరాశ ఆవరించిన పరిస్థితుల్లో.. పెద్దగా ఆర్భాటాలు లేకుండా.. నిశ్శబ్దంగా.. వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ నిశ్శబ్దమే ఓ కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. భారత కమ్యూనిజం కథ ముగిసిందా?
శిఖర స్థాయి నుంచి పాతాళానికి..
1947లో స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో రెండే బలమైన రాజకీయ శక్తులు.. ఒకటి కాంగ్రెస్, మరొకటి సీపీఐ. కమ్యూనిస్టుల సారథ్యంలో నడిచిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రకంపనలు యావత్ దేశంలో వినిపించాయి. ఆ ఉద్యమం అణచివేతకు గురై, కమ్యూనిస్టులు పార్లమెంటరీ రాజకీయాల్లోకి ప్రవేశించి సత్తా చాటారు. చట్టసభల్లోకన్నా బయట ప్రజల్లో కమ్యూనిస్టుల పలుకుబడి ఆకాశన్నంటే స్థాయిలో ఉండేది. ప్రజల సమస్యల మీద అనేకానేక ఉద్యమాలు నడిపించి అనేక హక్కులు సాధించారు. పేదవాడి గుండె చప్పుడు ఎర్రజెండా అనే పరిస్థితి నెలకొంది. 1970ల నాటికి రాజకీయాల్లో వామపక్షాలు గణనీయమైన శక్తిగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో అధికారానికి వచ్చి దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగారు. దక్షిణాదిన కేరళలో కాంగ్రె్‌సకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగారు. కేంద్రంలోనూ చక్రం తిప్పారు. 1984లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్‌గాంధీ హత్య అనంతరం తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో సంకీర్ణ రాజకీయాలను నడిపించారు. ఓ దశలో దేశ ప్రధాని అయ్యే అవకాశం కూడా వచ్చింది. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు ఆ అవకాశం వస్తే.. దానిని ఆయన పార్టీ సీపీఎం తిరస్కరించిందని, ఇది దేశ కమ్యూనిస్టు రాజకీయాల్లో ఒక చారిత్రక తప్పిదం అనే విశ్లేషణలు వెలువడ్డాయి. సోనియాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకొని 2004లో యూపీఏ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తూ కేంద్ర రాజకీయాల్లో వామపక్షాలు చక్రం తిప్పాయి. కానీ 2008లో అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఆ తర్వాత కేంద్రంలో అధికారానికి వామపక్షాలు దూరమైపోయాయి. అంతేకాదు బెంగాల్, త్రిపురల్లోనూ అధికారం కోల్పోయాయి. లోక్‌సభలో ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు 60 స్థానాలతో పార్లమెంటులో తమ శక్తిని చాటుకున్న వామపక్షపార్టీలు.. నేడు రెండంకెలకు కూడా చేరుకోలేని స్థితికి చేరుకున్నాయి. కేరళ తప్ప దేశంలో మరెక్కడా అధికారం లేదు. కేంద్రంలో పరిస్థితులు మారుతాయనే ఆశ లేదు. బెంగాల్‌లో మళ్లీ అధికారం దక్కే అవకాశం లేదు. మరోవైపు, కాలక్రమంలో కమ్యూనిస్టు ఉద్యమం పలు చీలికలకు లోనైంది. సీపీఐ నుంచి సీపీఐ(ఎం), దాన్నించి సీపీఐ(ఎంఎల్), అక్కడి నుంచి అనేకానేక గ్రూపులు.. నేటి మావోయిస్టుల దాకా.. ఈ విచ్ఛిన్నం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఇది దేశంలో కమ్యూనిస్టుల స్థాయిని రాజకీయాల్లో, ప్రజాఉద్యమాల్లో, ప్రజల్లో గణనీయంగా తగ్గించింది. ఇది కమ్యూనిస్టులకే కాదు.. భారతదేశానికే ఎనలేని నష్టం చేసిందన్న అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా, ఓ శిఖరాన్ని అధిరోహించి.. అక్కడి నుంచి కిందికి పడిపోయిన పరిస్థితి నేడు వామపక్షాలది.
పునరుద్ధరణ సాధ్యమేనా?
ఈ పరిస్థితి చూసి భారతదేశంలో కమ్యూనిజానికి, ఆ పార్టీలకు కాలం చెల్లిందన్న అభిప్రాయాలు వారి వ్యతిరేకుల్లోనే కాదు.. అనుకూలురుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. విచిత్రమేమిటంటే, ప్రపంచంలో కమ్యూనిజం అనే సిద్ధాంతం పుట్టుకకు కారణమైన సామాజిక, ఆర్థిక అంతరాలు వందేళ్ల కిందటి కంటే నేడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. నాడు నగ్నంగా కనిపించిన వివక్షలు, అంతరాలు నేడు అంత బట్టబయలుగా కనిపించకపోవచ్చు.. కానీ, అవి ఎక్కడా తగ్గలేదు సరికదా పెరిగాయి. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడే దేశంలో ధనిక, పేదల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, కార్మికుల హక్కులకు రక్షణ లేని పరిస్థితి, అధిక ధరలు, పెరుగుతున్న కుల, మత ఉన్మాదాలు, ప్రపంచమంతటా మళ్లీ బుసలు కొడుతున్న అమెరికా సామ్రాజ్యవాదం.. కమ్యూనిస్టులకు చేతినిండా పని కల్పించే పరిస్థితులే ఇవన్నీ అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి, దేశంలో కమ్యూనిస్టులు.. కోల్పోయిన తమ ప్రాభవాన్ని మళ్లీ సాధించుకోగలరా? దాని ముందున్న సవాళ్లేమిటి?
వ్యూహమే అసలు సమస్య
నేడు కమ్యూనిస్టు ఉద్యమానికి అసలైన సవాలు సిద్ధాంతం కాదు.. వ్యూహమే వారి సమస్య అన్నది పలువురి అభిప్రాయం. సిద్ధాంతాల్లోని సూక్ష్మ అంశాలను పక్కనపెట్టి.. విస్తృత ప్రజాస్వామ్య కూటమి వంటి ఓ విశాల వేదికతో ముందుకు వస్తే.. దేశ రాజకీయ అజెండాను ప్రభావితం చేసే అవకాశం ఇప్పటికీ కమ్యూనిస్టులకు ఉందన్నది వారి భావన. ఇటీవల కాలంలో ముందుకొచ్చిన ఓ ముఖ్యమైన పరిణామం.. దేశ రాజకీయాల్లో అంబేద్కర్ ప్రాధాన్యం గతంలో ఎన్నడూ లేనంతగా పెరగటం. ఆయనంటే ఇష్టమున్నా లేకున్నా ఆయన నామస్మరణ చేయటం అన్ని రాజకీయ పార్టీలకూ తప్పనిసరైంది. రాజ్యాంగం ఉంటేనే హక్కులకు రక్షణ అన్న భావన బలంగా నెలకొంది. దీనిని కమ్యూనిస్టులు ఒడిసిపట్టుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే లాల్-నీల్ (ఎరుపు-నీలం) అనే నినాదం ఉత్తరాదిన వినిపిస్తోందని గుర్తు చేస్తున్నారు. ‘అటు కులవ్యతిరేక సామాజిక సమతా ఉద్యమాన్ని, ఇటు ధనిక-పేద అంతరాలపై ఆర్థిక పోరాటాల్నీ కమ్యూనిస్టులు సమన్వయం చేసుకోవాలి. అంతకంటే ముందు, తమ శిబిరంలో దృఢమైన ఐక్యతను సాధించాలి. సీపీఐ, సీపీఎంల ఐక్యత ఎన్నటికీ సాధ్యం కాని స్వప్నం కాకూడదు’ అని ఓ రాజకీయ విశ్లేషకుడు వివరించారు. 21వ శతాబ్దంలో కమ్యూనిజం పాత నినాదాలతో కాకుండా.. కొత్త సామాజిక వాస్తవాలకు అనుగుణంగా, కొత్త తరాల్ని ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. కమ్యూనిజం అంతరించలేదని, ఎర్ర జెండాను భుజాన మోసే బాధ్యతను కొత్త తరం తీసుకుంటుందని ప్రపంచ పరిణామాలు నిరూపిస్తున్నాయని గుర్తు చేశారు. ‘లేకుంటే పెట్టుబడిదారీ ప్రపంచానికి కేంద్రబిందువైన అమెరికాలోని న్యూయార్క్‌లో.. వామపక్షవాది అయిన భారతీయ ముస్లిం జోహ్రాన్ మమ్దానీ మేయర్‌గా గెలిచేవాడా?’ అని ప్రశ్నించారు. ‘భారతీయ కమ్యూనిస్టులు కూడా కొత్త ప్రయోగాలు చేయాలి. కొత్త రక్తాన్ని ఆహ్వానించాలి. అప్పుడే.. వందేళ్ల ప్రయాణం.. ముగింపు కాకుండా మరో మలుపు మాత్రమే అవుతుంది’ అని వామపక్ష అభిమానులు చెబుతున్నారు.