ఎన్‌డీడీబీతో ఒప్పందంపైనే నార్మూల్ భవితవ్యం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:38 AM
పాడిరైతులకు, ఉద్యోగులకు వేతన బకాయిలు, బ్యాంకులకు, ఇతర సంస్థలకు అప్పులతో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మూల్) తీవ్ర ఆర్థిక సంక్షేభంలో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ, రంగారెడ్డి రెండు ఉమ్మడి జిల్లాల పాడిరైతులతో ముడిపడి ఉన్న నార్మూల్ సంస్థ ను కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ముమ్మర ప్ర యత్నాలు సాగుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించిన ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ చైర్మన్లు
యాదాద్రి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పాడిరైతులకు, ఉద్యోగులకు వేతన బకాయిలు, బ్యాంకులకు, ఇతర సంస్థలకు అప్పులతో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మూల్) తీవ్ర ఆర్థిక సంక్షేభంలో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ, రంగారెడ్డి రెండు ఉమ్మడి జిల్లాల పాడిరైతులతో ముడిపడి ఉన్న నార్మూల్ సంస్థ ను కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ముమ్మర ప్ర యత్నాలు సాగుతున్నాయి. నార్మూల్ సంస్థ బకాయిలను చెల్లింపులు చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు మనుగడ సాగించేందుకు జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ)తో ఒప్పందం కుదుర్చుకుని సం యుక్తంగా కార్యకలాపాలు సాగించే అవకాశాలపై ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. నార్మూల్ పాలకవర్గంలో విభేదాలు, అవినీ తి, అక్రమాలు వెలుగుచూడటమే గాక సుమా రు ఏడాది కాలంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పాడిరైతులకు పేరుకుపోయిన బకాయిలతో పాల సేకరణ సైతం పూర్తిగా పడిపోవడం వంటి సమస్యలతో రోజురోజుకూ ఆర్థికంగా చితికిపోతోంది. నాలుగు దశాబ్దాల క్రితం పాడిరైతులకు అండదండగా, వారి సం క్షేమం కోసం ఏర్పాటైన సంస్థ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మారింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాడిరైతుల నుంచి నార్మూల్ సేకరించి న పాలను జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమై న ఎన్‌డీడీబీకి అప్పగించడం ద్వారా వాటిని ఉత్పత్తి చేయడమే గాక, హైదరాబాద్ నగ రం, పరిసర ప్రాంతాల్లో పాల విక్రయం, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ హక్కులను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలు దఫాలు ఎన్‌డీడీబీ చైర్మన్, ఢిల్లీ మదర్ డెయిరీ చైర్మన్లతో నార్మూల్ పాలకవర్గం, రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీడీడీసీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు కలిసి చర్చించారు. అయితే ప్రాథమికం గా ఎన్‌డీడీబీ ఉన్నతాధికారులు నార్మూల్‌తో ఒప్పందాలకు సానుకూలంగా స్పందించినప్పటికీ, ఆర్థిక అంశాలతో పాటు నార్మూల్ ఆస్తుల విషయంలో సాంకేతిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ, ఎన్‌వోసీ కోరుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నార్మూల్‌ను రక్షించేందుకు సంస్థ పాలకవర్గానికి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు ఎన్‌డీడీబీతో ఒప్పందం కుదుర్చుకుని నార్మూల్ పాల సేకరణ, ఎన్‌డీడీబీ పాల ఉత్పత్తుల ప్రాసెస్, ఢిల్లీ మదర్ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలు చేపట్టడానికి త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎన్‌డీడీబీ పాలకవర్గం అధ్యక్షుడు మీనే్‌షషా, ఢిల్లీ మదర్‌డెయిరీ చైర్మన్ జయతీర్థాచారి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నార్మూల్ చైర్మన్ గుడిపాటి మదుసూధన్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే త్రైపాక్షిక ఒప్పందంలోని అంశాలకు సంబందించిన డాక్యుమెంట్‌ను ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్‌డెయిరీ ఉన్నతాధికారులు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. వీటిలో నార్మూల్ ఆస్తులతో పాటు ఆర్థికపరమైన వ్యవహారాలు, సంస్థ కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ వంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ అంశాలతో కూడిన ఒప్పందాల్లో ప్రభుత్వ నిబంధనలు పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఇలంబర్తికి సూచించినట్టు తెలుస్తోంది. నార్మూల్, ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్‌డెయిరీ మధ్య ఒప్పందం కుదిరితే సంస్థ భవితవ్యం కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై నార్మూల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఎన్‌డీడీబీతో నార్మూల్ ఒప్పందంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ జారీ చేసిన తదుపరి మూడు, నాలుగు రోజుల్లో ఒప్పందం కుదిరి, ఎంవోయూలపై సంతకాలు చేసిన వెంటనే రైతుల పాలబకాయిల చెల్లింపులు జరుగుతాయనే ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ నిర్వహించి, దోషుల నుంచి ఆ సొమ్మును కక్కిస్తామని చెప్పారు.