Share News

kumaram bheem asifabad- విస్తరిస్తున్న ‘ఆయిల్‌పామ్‌’

ABN , Publish Date - Apr 07 , 2026 | 10:50 PM

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు క్రమంగా విస్తరిస్తోం ది. అధికారుల ప్రోత్సాహం, ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సాగుకు మొగ్గు చూపుతు న్నారు. దేశ వ్యాప్తంగా వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా, ప్రత్యేక సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

kumaram bheem asifabad- విస్తరిస్తున్న ‘ఆయిల్‌పామ్‌’
లోగో

ఇప్పటికే జిల్లాలో 1,700 ఎకరాల్లో సాగు

- ఆశాజనకంగా ధర..అన్నదాతకు ఊరట

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు క్రమంగా విస్తరిస్తోం ది. అధికారుల ప్రోత్సాహం, ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సాగుకు మొగ్గు చూపుతు న్నారు. దేశ వ్యాప్తంగా వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా, ప్రత్యేక సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోంది. భవిష్యత్తులో వంట నూనెల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 7వేల ఎకరాలు సాగులో ఉంది. ధర పెరగడంతో రైతులు తోటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. పామాయిల్‌ గెలలు టన్ను ధర రూ. 21వేల వరకు ఉండగా రూ. 23వేలుకు పెరగడం రైతులకు ఊరట కలిగించేవిధంగా ఉంది. జిల్లా వాప్తంగా ఆయిల్‌ పామ్‌ గెలలు కొనుగోలు కోసం గతంలో ఉన్న కంపెనీ కాకుండా ఈ సారి నూతనంగా ఆయిల్‌ ఫెడ్‌ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఒక్క టన్నుకు ధర మంచిగా ఉండడంతో పాటు రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం కూడా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని హార్టికల్చర్‌ అధికారిణి సుప్రజ తెలిపారు.

- ఆయిల్‌ ఫెడ్‌ కంపెనీ ద్వారా..

ఆయిల్‌ ఫెడ్‌ కంపెనీ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంటను నేరుగా వచ్చి కొనుగోలు చేస్తుండడంతో రైతులకు వెసులుబాటు లభిస్తుంది. నెలనెలా గెలలు సాగు అవుతుంటాయని దీంతో రైతులకు మంది దిగుబడితో ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు.ఆయిల్‌ పామ్‌ గెలలు నెల నెల కోతకు వస్తాయని, అలాగే వర్షాకాలంలోనైతే 15 రోజుల సమయంలో గెలలు కాస్తాయని దీంతో దిగుబడితో పాటు ధర కూడా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు నేలలు అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో సబ్సిడీలు భారీగా అందించి రైతులను పోత్సాహకాలు అందిస్తోంది. గతంలో మాట్రిక్స్‌ కంపెనీ ఆయిల్‌ పామ్‌ పంటను కొనుగోలు చేయడం జరిగిందని, ప్రస్తుతం నూతనంగా మరో కంపెనీతో ఒప్పందంలో భాగంగా రైతులకు అన్నిరకాలుగా మేలు జరుగనుంది. పండిన గెలలను రైతుల నుంచి కొనుగోలు చేసి వారి ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే రైతులు ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటలను కూడా పండించవచ్చు. అంతర పంటల్లో ఎకరాకు రూ.4200 ప్రభుత్వం రైతులకు అందజేసి వారిని ప్రోత్సహిస్తోంది. అంతర పంటలతో పాటు పామాయిల్‌ పంటలకు ఎక్కువ నీటి లభ్యత కావాల్సి ఉంటుందని, దీంతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను కూడా 90 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఒక్కో మొక్కకు రూ. 200 ఉండగా కేవలం 20 రూపాయలకే మొక్కలను అందజేస్తుందని తెలిపారు. గత సంవత్సరం 1000 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేశారు. కానీ ప్రస్తుతం 2025-26 సంవత్సరలో అది 1,700 ఎకరాలకు పెరిగిందని రైతులను మరింత ప్రోత్సహించి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు ఆయిల్‌ పాం పంట ఎంతగానో ఉపయోగరమని, రైతులు అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని హార్టికల్చర్‌ అధికారులు వివరిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

-సుప్రజ, హార్టికల్చర్‌ అధికారి

ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్స్‌ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టన్ను ధర కూడా పెంచింది. ఆయిల్‌పామ్‌తో రైతులకు ఆదాయంతో పాటు అంతర పంటలను వేసుకోవడంతో పాటు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. మార్కెట్‌ సౌకర్యంతో పాటు అన్ని రకాల సౌలభ్యంతో రైతుకు పోత్సాహాకాలు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనుకూలంగా నేలలున్నందున రైతులు అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.

Updated Date - Apr 07 , 2026 | 10:50 PM