Share News

kumaram bheem asifabad- రేషన్‌ బియ్యం పంపిణీని పర్యవేక్షించాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 10:31 PM

రేషన్‌ బియ్యం పంపిణీని అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి ఆహార భద్రత విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- రేషన్‌ బియ్యం పంపిణీని పర్యవేక్షించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం పంపిణీని అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి ఆహార భద్రత విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని రేషనుకార్డుదారులకు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో 315 రేషను దుకాణాలు ఉన్నాయని, 973 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,173 పాఠశాలలు, 115 సంక్షేమ వసతి గృహలకు ప్రతీనెల 3,205 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా జరుగుతుందన్నారు. ప్రజాపంపిణీలో డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఇంకా జిల్లాలో 40 డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. కొత్త రేషను దుకాణాలకు జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈకేవైసీ చేసుకోని వారు ఈనెల31లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతీ కార్డుదారునిడికి బియ్యం పంపిణీ సక్రమంగా చేపట్టాలన్నారు. రవాణా సౌకర్యంలేని గ్రామాలకు మూడు నెలల బియ్యం కోటాను ముందే సరఫరా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్‌లో ఉన్న రేషనుకార్డులను త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. సమావేశంలో జడ్పీసీఈవో లక్ష్మీనారాయణ, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఈవో సచ్చిదానందచారి, గిరిజన సంక్షేమశాఖ డీడీ జాదవ్‌ అంబాజీ, డీఎస్‌వో సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 10:31 PM