Share News

నిద్రిస్తున్నా వెంటాడిన మృత్యువు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:36 AM

అతి వేగంగా వస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ఐదు మీటర్ల దూరంలో నిద్రిస్తున్న వ్యక్తిపై బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

నిద్రిస్తున్నా వెంటాడిన మృత్యువు

డీసీఎం వాహనం అదుపుతప్పి వ్యక్తిపై బోల్తా

గ్రామస్థుడు అక్కడికక్కడే దుర్మరణం

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో విషాదం

వేములపల్లి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అతి వేగంగా వస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ఐదు మీటర్ల దూరంలో నిద్రిస్తున్న వ్యక్తిపై బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెంలో ఈ సంఘటన జరిగింది. వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన ఎలక్ర్టీషియన్‌ పోలెబోయిన వెంకన్న(49) ఆదివారం రాత్రి తన ఇంటి ముందు ఉన్న గొర్లమందకు కాపలాగా మంచం వేసుకొని నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున పెద్ద శబ్దం రావటంతో స్థానికులు నిద్రలేచి చూడగా వెంకన్నపై కంటైనర్‌ వాహనం పడి ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నడుము భాగం మొత్తం ఛిద్రమై వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న డీసీఎం కంటైనర్‌ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ఓ విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి రహదారికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న వీధిలోకి బోల్తా కొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం కంటైనర్‌ను ఎక్స్‌కవేటర్‌తో పైకి తీయించి వెంకన్న మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు వెంకన్నకు కుమారుడు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:36 AM