Share News

kumaram bheem asifabad-సాగు లెక్క.. ఇక పక్కా

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:01 PM

రైతుల పంటల సాగు నమోదు ప్రక్రియను డిజిటల్‌ రూపంతో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌) చేయడానికి సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా రైతులు ఏటేటా వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో ప్రతీ రైతు పొలానికి వెళ్లి పంట నమోదు చేయడం వ్యవసాయాధికారులకు కష్టంగా మారింది. మహిళా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

kumaram bheem asifabad-సాగు లెక్క.. ఇక పక్కా
పంట నమోదుపై

- ప్రారంభమైన డిజిటల్‌ సర్వే

- రైతుల పంటల కచ్చితమైన వివరాలు తెలిసేలా చర్యలు

వాంకిడి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రైతుల పంటల సాగు నమోదు ప్రక్రియను డిజిటల్‌ రూపంతో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌) చేయడానికి సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా రైతులు ఏటేటా వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో ప్రతీ రైతు పొలానికి వెళ్లి పంట నమోదు చేయడం వ్యవసాయాధికారులకు కష్టంగా మారింది. మహిళా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు, ధాన్యం కొనుగోలు, అన్నదాతలకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం వంటి పనులతో తీరిక ఉండడంలేదు. దీనివల్ల నమోదు కష్టతరంగా మారింది. ఫలితంగా పంటల సాగు లెక్క పక్కాగా ఉండడంలేదు. ఈ నేపథ్యంలో పంటల డిజిటల్‌ సర్వేకు వలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయాధికారులు, ఏఈవోలకు ఉపశమనం లభిందింది.

- 4.45 లక్షల ఎకరాల్లో పంటలు..

జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. మొత్తంగా 97,363 మంది రైతులు ఉన్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. డిజిటల్‌ పంటల సర్వే కోసం గ్రామానికి ఒకరిచొప్పున వలంటీర్లను నియమించారు. ఈ పంటల డిజిటల్‌ నమోదు పక్కగా ఉండేందుకు ప్రభుత్వం వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకున్నది. స్థానికుడై ఉండి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వలంటీర్ల ఎంపిక ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తి చేశారు. ఎంపికైన వలంటీర్లు వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలను డిజిటల్‌ విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి లభిస్తుంది. వలంటీర్లకు ఒక సర్వే నంబరు నమోదుకు రూ. 7 చొప్పున చెల్లిస్తారు.

- ఎంపికైన వారికి శిక్షణ..

ఎంపికైన వలంటీర్లకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. క్షేత్రస్థాయిలో సెల్‌ఫోన్లలో ఏ పంట ఎలా నమోదు చేయాలి, తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇప్పటి నుంచి పంటల నమోదు పక్కాగా జరుగనుంది. వరి, పత్తి పంటలను అమ్ముకోవాలంటే ముం దుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో వస్తున్న ఇబ్బందులు, పని ఒత్తిడి వల్ల ఏఈవోలు ఆన్‌లైన్‌ చేయ లేకపోతున్నారు. పంట విక్రయానికివెళ్తే వివ రాలు ఆన్‌లైన్‌లో కనిపించక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. డిజిటల్‌ సర్వే వల్ల ఈ ఇబ్బందులు తొలగనున్నాయి.

- ప్రక్రియ పూర్తి చేశాం..

మిలింద్‌- ఏడీఏ, ఆసిపాబాద్‌

డిజిటల్‌ సర్వేకు గ్రామాల్లో వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తి చేశాం. ఏఈవోలు స్థానికంగా ఉన్న అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వలంటీర్లకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు శిక్షణ ఇచ్చి డిజిటల్‌ పంటలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇకపై పంటల సర్వే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా కొనసాగనుంది.

Updated Date - Mar 19 , 2026 | 11:01 PM