గజ్జెల లాగుల గలగలలు.. కత్తి కటారుల విన్యాసాలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:33 AM
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో లింగమంతులస్వామి జాతరకు సోమవారం భక్తులు పోటెత్తారు
ఓ లింగా నామస్మరణతో మార్మోగిన ఎర్రబెల్లి గట్టు
నిడమనూరు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో లింగమంతులస్వామి జాతరకు సోమవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాలో రెండో పెద్దగట్టుగా ప్రసిద్ధి చెందిన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గజ్జెల లాగుల గలగలలు.. యాదవులు చేసే కత్తి కటారుల విన్యాసాలు, డోలు వాయింపులు.. భక్తుల ఓ లింగా.. లింగా నామస్మరణతో ఎర్రబెల్లి గట్టు మార్మోగింది. శివసత్తుల పూనకాలతో, యాదవుల ప్రత్యేక వేషదారణతో స్వామివారికి బోనాలు సమర్పించారు. జాతరలో భాగంగా తెల్లవారుజామున లింగమంతులస్వామి, మాణిక్యాలదేవి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు ఆదివారం రాత్రి నుంచే గట్టు వద్దకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లో గుడారాలు వేసుకొని స్వామివారికి నైవే థ్యం సమర్పించి, బంధుమిత్రులతో అక్కడే భోజనాలు ఆరగించారు. జాతరకు 50వేల నుంచి 60 వేల మంది వరకు భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వందల సంఖ్యలో గల ఆటబొమ్మల దుకాణాలు, పండ్ల రసాల బండ్లు, అల్పాహారశాలలు, బొంగులు, పుట్నాలు, మిఠాయిలు, లడ్డూలు, గాజుల దుకాణాలతో గుట్ట పరిసరాలు మొత్తం నిండిపోయాయి. అనేకమంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ పొట్లాలు, అల్పాహారం, పులిహోర పంపిణీ చేశాయి.
డోలు వాయించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే:
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి జాతరకు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయించారు. జాతరకు భక్తులు పోటెత్తడంతో పాటు వాహనాల రద్దీ కారణంగా పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు జాతరకు హాజరైన భక్తులు వంటలు చేసుకునేందుకు ఆలయ సమీపంలో స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఆలయ పరిసరాల్లో చెల్కలు ఉండడంతో అక్కడే టెంట్లు వేసుకుని వంటలు చేసుకుని బంధుమిత్రులతో ఆరగించేవారు. కానీ ఈ ఏడాది ఆలయం చుట్టూరా పొలాలు సాగు చేయడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. 80 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ సతీ్‌షరెడ్డి, ఎస్‌ఐ ఉప్పు సురేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, నాయకులు కర్నాటి లింగారెడ్డి, అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, వల్లభ్‌రెడ్డి, తాటి సత్యపాల్ పూజల్లో పాల్గొన్నారు.