kumaram bheem asifabad- మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:45 PM
మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించింది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు.
- నేటి నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
- ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్
- జిల్లాలో 50 వార్డులకు ఎన్నికలు
ఆసిఫాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించింది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌తో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
జిల్లాలో రెండు మున్సిపాలిటీలు..
జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా ఇది వరకే రిజర్వేషన్‌లను అదికారులు ఖరారు చేశారు. ఆసి ఫాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ జనరల్‌కు, కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు.ఆసిఫాబాద్ మున్సిపాలిటిలో 20 వార్డులు ఉండగా అందులో ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2,ఎస్సీ మహిళ 1 ,బీసి జనరల్ 3 , బీసి మహిళ 2, జనరల్ 4 ,జనరల్ మహిళ 6 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటి లో 30 వార్డులు ఉండగా ఇందులో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 3 ,ఎస్సీ మహిళ 2 ,బీసి జనరల్ 5 , బీసి మహిళ 4, జనరల్ 6 , జనరల్ మహిళ 9 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు.
- 65,132 మంది ఓటర్లు..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో మొత్తం 65,132 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఫిబ్రవరి 11న 65,132 మంది పట్టణ ఓటర్లు తమతమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఆసిపాబాద్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులో 13,927 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 6822 మంది, మహిళలు 7103 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 25,004 మంది, మహిళలు 26,193 మంది, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు.
షెడ్యూల్ ఇలా..
జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలు.
31న నామినేషన్ల పరిశీలన.
ఫిబ్రవరి 1న నామినేషన్ల తిరష్కరణపై అప్పీల్.
ఫిబ్రవరి 2న అప్పీళ్ల పరిష్కారం.
ఫిబ్రవరి 3న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఫిబ్రవరి 11న పోలింగ్(ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు).
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడించనున్నారు.