Share News

best education : ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:40 AM

ఉత్తమ విద్యాభోదనే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

best education : ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం

వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

భువనగిరి (కలెక్టరేట్‌), జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ విద్యాభోదనే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ బలరాంనాయక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించే ఉద్దేశంతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79 పాఠశాలలు మంజూరు కాగా, వాటిలో 76 టెండర్లు పూర్తయ్యాయని, 18 పాఠశాలల పనులు కూడా ప్రారంభించినట్టు తెలిపారు. కలెక్టర్లు విధిగా పాఠశాలల నిర్మాణ పురోగతిని పరిశీలించి నివేదికలు పంపాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ, జిల్లాలో ఆలేరు, భువనగిరికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు.

‘ప్రజావాణి’ అర్జీలను పరిష్కరించాలి : కలెక్టర్‌

‘ప్రజావాణి’లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి 35 దరఖాస్తు లు తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూశాఖకు చెందినవి 22 ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్వో జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జయశ్రీ, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఎస్‌ రామకృష్ణారావు

మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మునిసిపల్‌శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తుది ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటనల అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. వాటి పరిష్కారం తదుపరి ఈ నెల 16న తుది పోలింగ్‌ కేంద్రాల ప్రకటన జారీ చేయాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు అవసరమైన సామగ్రిని గుర్తించి పూర్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసేలోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:40 AM