kumaram bheem asifabad-గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - May 02 , 2026 | 10:37 PM
గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించారని వివరించారు
కాగజ్‌నగర్, మే 2 (ఆంధ్రజ్యోతి): గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించారని వివరించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లోని కీలక సమస్యలు ఇట్టే తెలుస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అర్హులైన లబ్ధిదారులకు అందేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ జరిగేట్టు ఉంటుందన్నారు. అత్యవసరమున్న పనులకు త్వరితగతిన ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో చోటు దక్కని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత పెన్షన్, కొత్త రేషన్ కార్డుల్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు వివరించారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో వివిధ సమస్యలు, పరిష్కరించే దిశగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో రూపొందించినట్టు వివరించారు. మండలాల అనుసంధాన రోడ్లు, అంతర్గత రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అంశాలను క్షేత్ర స్థాయిలో పరిగణలోకి తీసుకొని రూపొందించినట్టు వివరించారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు పలు సమస్యలపై ఈ సందర్భంగా సభా దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దాల దేవయ్య, డీఎస్పీ వహీదోద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.