అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 29 , 2026 | 11:25 PM
వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని , నదుల్లో నీటి ప్రవాహ తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని , నదుల్లో నీటి ప్రవాహ తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని అర్జునగుట్ట సమీపంలో గల ప్రాణహిత నది తీరాన్ని సందర్శించి నీటి ప్రవాహం , ప్రస్తుత పరిస్థితులపై పరిశీలన జరిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి మెను అమలు, రిజిష్టర్‌లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెను ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులతో ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులపై సమీక్షించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలాయన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్‌లు పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పరిస్థితి అస్థవ్యస్థంగా ఉండడంతో ఆయన ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని , వైద్యులు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని , సమయ పాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని , ఆసుపత్రిలో గర్భిణీల వివరాల జాబితా రూపొందించాలని , ప్రసవాలు ఆసుపత్రిలో జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే పారిశుధ్య్ద నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ రాఘవేందర్‌రావు, చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.