హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేయాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:44 AM
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో భూ తగాదాలో మహిళ గొంతు కోసి హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
మోత్కూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో భూ తగాదాలో మహిళ గొంతు కోసి హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. గురువారం పాలడుగులో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొంత వెంకటమ్మ అలియాస్ లక్ష్మీ గొంతుకోసి హత్యాయత్నం చేసిన నిందితులు బొంత అశోక్, అతని అక్కల ఇద్దరు కుమారులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న మరిది అశోక్, అతని అక్కల ఇద్దరు కుమారులు కత్తితో ఆమెపై దాడి చేసి గొంతు కోయడం తో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఆమె భర్త చనిపోవడం, పిల్లలు చిన్న వారు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాస్తారోకోతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న మోత్కూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. సంఘటన జరిగి మూడు రోజులు అయినా నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ప్రశ్నిం చారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, గ్రామస్థుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, బాధితురాలికి న్యాయం చేస్తామని సీఐలు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకో విరమించిన అనంతరం సర్పంచ్ అంతటి భగవంతు, బాధితురాలి బంధువులు మోత్కూరు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాద చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.