అవును.. పలుమార్లు సింగిల్ టెండర్లే వచ్చాయి!
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:47 AM
ప్రభుత్వ ఆస్పత్రుల కోసం కొనుగోలు చేయాలనుకుంటున్న ఎంఆర్‌ఐ యంత్రాల టెండరు ప్రక్రియలో సింగిల్ టెండర్లు పదేపదే రావడంతో కొనుగోలు వాయిదా వేశామని...
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై టీజీఎంఎస్ఐడీసీ వివరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల కోసం కొనుగోలు చేయాలనుకుంటున్న ఎంఆర్‌ఐ యంత్రాల టెండరు ప్రక్రియలో సింగిల్ టెండర్లు పదేపదే రావడంతో కొనుగోలు వాయిదా వేశామని, కొనుగోళ్ల ప్రక్రియలో నిబంధనలను పాటించామని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) తెలిపింది. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోల్‌మాల్’ కథనంపై కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. వైద్య కళాశాలల కోసం ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరుగుతోందంటూ ఎండీ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. 3 టెస్లా ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు తెలిపింది. మొదటి దఫాలో ఒకే బిడ్డర్ పాల్గొనగా, సింగిల్ బిడ్ కారణంగా బిడ్ ఫైనలైజేషన్ కమిటీ వాయిదా వేసిందని వెల్లడించింది. రెండో దఫా టెండర్‌లో కూడా ఒకే బిడ్డర్ పాల్గొనడంతో అదే కారణంతో మళ్లీ వాయిదా వేసినట్లు పేర్కొంది. 1.5 టెస్లా ఎంఆర్‌ఐ యంత్రాల కోసం మొదటి టెండర్‌కు స్పందన రాలేదని తెలిపింది. రెండో, మూడో దఫాల్లో ఒక్కో బిడ్డర్ మాత్రమే పాల్గొనడంతో సింగిల్ బిడ్ కారణంగా బిడ్ ఫైనలైజేషన్ కమిటీ వాయిదా వేసిందని స్పష్టం చేసింది. కమిటీ ఆమోదించిన బిడ్డర్ నుంచే యంత్రాలు కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు విషయంలో ఒక్కో యంత్రానికి అదనంగా కోట్ల రూపాయలు కోట్ చేశారని, ఇందుకు సంస్థలోని కీలక అధికారులు సహకరిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో తెలిపింది. అయితే ధర అంత ఎక్కువగా ఎందుకు కోట్ చేశారన్న దానిపై కార్పొరేషన్ అఽధికారులు స్పష్టతనివ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం కేవలం ఒక సంస్థకు లబ్ధి చేకూర్చేలా కార్పొరేషన్ అధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది. అదనంగా రూ.30 కోట్లు కోట్ చేసిన విషయాన్ని సంస్థ ఎందుకు బహిరంగంగా వెల్లడించడం లేదో చెప్పాల్సి ఉంది.