అణచివేత నుంచి ఆత్మగౌరవం వైపు
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:12 AM
రాష్ట్రంలో గత పాలనలో నెలకొన్న అణచివేత, అవమానాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవం వైపు ఉద్యోగుల ప్రయాణం మొదలైందని తెలంగాణ గెజిటెడ్ ..
గత ప్రభుత్వ పాలనలో అన్ని శాఖల్లో అరాచకం
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అభయహస్తం
స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం: టీజీవో అధ్యక్షుడు ఏలూరి
జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత పాలనలో నెలకొన్న అణచివేత, అవమానాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవం వైపు ఉద్యోగుల ప్రయాణం మొదలైందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పేర్కొంది. గత పాలనలో వేతనాలు ఎప్పుడు పడతాయో తెలియని స్థితి ఉండేదని, ఉద్యోగులు అడుగడుగునా వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిదని, సచివాలయానికి వెళ్లలేని అప్రకటిత ఎమర్జెన్సీ ఉండేదని పేర్కొంది. ఈ మేరకు టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రదాన కార్యదర్శి బి.శ్యామ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక ఫిక్స్ ఇంక్రిమెంట్ మినహా దశాబ్దకాలంలో రెండో పీఆర్సీ, బకాయిలు, ఉద్యోగ విరమణ చెల్లింపులు, డీఏల పెండింగ్ సంస్కృతికి బీజం పడిందని పేర్కొన్నారు. గతపాలనలో అన్ని శాఖల్లో అరాచకం నెలకొందని.. విద్యారంగం వీధి పాలైందని, కుల గురకులాల పేరుతో కులాల స్థిరీకరణకు పునాది వేశారని విమర్శించారు. ప్రశ్నించిన ఉద్యోగులను వెంటాడటం, వేధించడం, అర్థం లేని ఆరోపణలతో సస్పెన్షన్లు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగికి మూడు పదోన్నతులను తొక్కిపెట్టి.. అర్హత లేకున్నా అనుయాయులను అందలమెక్కించిన ఘనచరిత్ర గత పాలకులదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు అభయహస్తం ఇచ్చిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ముసుగులో పాలకులకు భజన సంఘంగా పని చేసిన నాయకత్వాన్ని మార్చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు కదిలిందని పేర్కొన్నారు. 2024 సెప్టెంబరు 24న ఉద్యోగ సంఘాలకు చెందిన 30 మంది ప్రతినిధులను పిలిపించుకొని సీఎం స్నేహపూర్వక వాతావరణం మధ్య చర్చలు చేశారని చెప్పారు. 12 ఆర్థిక, 52 ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందుంచగా.. వాటి పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని హామీ ఇచ్చారన్నారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే దగ్గర నుంచి.. పెండింగ్ డీఏలను విడతల వారీగా చెల్లిస్తున్నారన్నారు. గతంలో బదిలీల కోసం ఎనిమిదేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని.. రేవంత్ ప్రభుత్వంలో రెండున్నరేళ్లలో రెండు పర్యాయాలు సాధారణ బదిలీలు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చొరవ తీసుకుందని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారి బకాయిలు రూ.6000 కోట్ల దాకా పేరుకుపోగా.. వాటిని వంద రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం తొలి 60 రోజుల్లో రూ.4000 కోట్లు చెల్లించారని చెప్పారు. నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు వరసలో నిలపాలనే లక్ష్యసాధనకు ప్రతి ఉద్యోగి కంకణబద్దులవుతారని తెలిపారు.