ఐడీపీఎల్ భూములు మీవనడానికి ఆధారాలున్నాయా?
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:27 AM
రూ.700 కోట్ల విలువైన మా భూములు ఆక్రమించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి’ అంటూ ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు.
14 ఎకరాలపై హక్కు పత్రాలు చూపండి
టీజీఐఐసీని కోరినబాలానగర్ పోలీసులు
ఆధారాలిస్తే కేసు పెడతామని వెల్లడి!
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్ర జ్యోతి): ‘రూ.700 కోట్ల విలువైన మా భూములు ఆక్రమించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి’ అంటూ ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా, ‘ఆ భూములపై మీకున్న హక్కులేంటో చూపండి’ అని పోలీసులు టీజీఐఐసీని కోరడం గమనార్హం. 14 ఎకరాల ఐడీపీఎల్ భూమి ఆక్రమణపై ఈ నెల 17న బాలానగర్ పోలీసు స్టేషన్‌లో టీజీఐఐసీ జోనల్ మేనేజరు అనురాధ ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విలువైన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రెవెన్యూ, సర్వే, ఐడీపీఎల్, ఎన్‌ఐపీఈఆర్ ఉద్యోగుల పాత్ర ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కానీ, ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదులో బాలానగర్ పోలీసులు జాప్యం చేస్తున్నారు. ఇదే విషయంపై బాలానగర్ సీఐ నర్సింహరాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఐడీపీఎల్ భూములపై టీజీఐఐసీకి ఉన్న హక్కుకు సంబంధించిన ఆధారాలు చూపాలని కోరినట్లు చెప్పారు. భూముల అప్పగింతకు సంబంధించి వారి వద్ద ఉన్న రికార్డులను చూపించాలని కోరామన్నారు. ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో న్యాయసలహా తీసుకుంటున్నామని తెలిపారు. ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాల భూమిని 2003లో పరిశ్రమ మూత పడిన తర్వాత.. స్వాధీనం చేసుకుంటామని అప్పటి కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. 2008లో ఆ భూములను టీజీఐఐసీకి అప్పగించారు. ఈ అప్పగింతకు బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్సియల్ రీ కనస్ట్రక్షన్ (బీఐఎ్‌ఫఆర్) అడ్డు చెప్పింది. అభ్యంతరం ఉంటే తమ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసీకి సూచించింది. అయినా టీజీఐఐసీ కోర్టును ఆశ్రయించలేదు. విలువైన భూములని, వాటి సంరక్షణ కోసం తక్షణమే కోర్టును ఆశ్రయించాలంటూ 2017 మే 8న ఒకసారి, 2024 డిసెంబరు 3న మరోసారి టీజీఐఐసీ ఎండీకి మేడ్చల్ కలెక్టర్ లేఖలు కూడా రాశారు. తాజాగా భూముల వివాదం మరోసారి తెరపైకి రావడంతో ఐడీపీఎల్ భూముల స్వాధీనంపై అప్పీల్ చేసేందుకు టీజీఐఐసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే భూముల ఆక్రమణలపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదుకు హక్కు పత్రాలు చూపాలని పోలీసులు కోరడం చర్చనీయాంశంగా మారింది.