పాలిసెట్‌లో బాలికలదే హవా
ABN , Publish Date - May 24 , 2026 | 04:48 AM
రాష్ట్రంలోని 111 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీన నిర్వహించిన టీజీ పాలిసెట్‌లో బాలికలు సత్తా చాటారు.
బాలికలు 86.38 శాతం.. బాలురు 79.92 శాతం అర్హత.. మొత్తంగా 82.94 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
టీజీ పాలిసెట్ 2026 ఫలితాల విడుదల
27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలోని 111 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీన నిర్వహించిన టీజీ పాలిసెట్‌లో బాలికలు సత్తా చాటారు. ఈ పరీక్షలో బాలురు 79.92 శాతం మంది అర్హత సాధించగా.. బాలికలు 6.46 శాతం అధికంగా 86.38 శాతం మంది అర్హత సాధించారు. పాలిసెట్-2026 ఫలితాలను మసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవేసన శనివారం విడుదల చేశారు. ఈసారి మొత్తంగా 82.94 శాతం మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 82 శాతం, ఎంబైపీసీ విభాగంలో 81 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షకు 1,06,439 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,029 మంది పరీక్ష రాశారు. వీరిలో 81,307 అర్హత సాధించారు. రాష్ట్రంలో 31,722 పాలిటెక్నిక్ సీట్లు ఉన్నాయి. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ నెల 27 నుంచి మొదటి విడుత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఫలితాల విడుదల కార్యక్రమంలో సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య, అధికారులు గిరిబాబు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫలితాల విడుదల అనంతరం శ్రీదేవసేన మీడియాతో మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమ చదువు పూర్తిచేసుకోగానే ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
టాపర్లుగా 11 మంది
పాలిసెట్‌లో ఈసారి ఎంపీసీ విభాగంలో 11 మందికి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు లభించింది. వీరంతా 120 మార్కుల పేపర్‌లో 120 మార్కులు సాధించారు. దీంతో ప్రస్తుతానికి అందరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. త్వరలో సబ్జెక్టులవారీగా వచ్చిన మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా ర్యాంకులను ఖరారుచేస్తారు. కోట్ల అపూర్వ, రుద్రోజు సాజన్ అనే విద్యార్థులు ఎంపీసీతోపాటు ఎంబైపీసీ విభాగంలోనూ మొదటి ర్యాంకు సాధించారు. 119/120 మార్కులు సాధించిన ఐదుగురు అభ్యర్థులకు 12వ ర్యాంకును కేటాయించారు. గతేడాది పాలిటెక్నిక్‌లలో మొత్తం 25 డిప్లొమా కోర్సులు ఉండగా, ఈ ఏడాది 5 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు.
ఎల్‌పీసెట్‌లో 57.28 శాతం పాస్..
ఐటీఐ పాసైన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఎల్‌పీసెట్‌లో 57.28 శాతం మంది అర్హత సాధించారు. బాలురు 57.23 శాతం, బాలికలు 58.82 శాతం అర్హత సాధించినట్లు శ్రీదేవసేన వెల్లడించారు. ఎల్‌పీసెట్ పరీక్షకు 508 మంది హాజరు కాగా, 291 మంది అర్హత సాధించినట్ల్లు తెలిపారు. 75 మార్కులు సాధించిన దేసోజు ప్రసాద్ మొదటి ర్యాంకుసాధించగా, 73 మార్కులు సాధించిన దామోదర నవీన్‌కుమార్, పులగిరి వేణుగోపాల్ 2, 3 ర్యాంకులు పొందారు.

సివిల్స్ నా టార్గెట్
నాన్న ఏఎం అహ్మద్ సివిల్ కాంట్రాక్టర్. నాకు అక్క, తమ్ము డు ఉన్నారు. పదోతరగతిలో 583 మార్కులు సాధించాను. సివిల్ సర్వీసెస్ అధికారి కావటమే నా టార్గెట్. తల్లిదండ్రులు చదువుకోవడానికి సహకరించారు.
- షిఫాలి, ఎంపీసీ ఫస్ట్ ర్యాంకర్

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తా
మాది వరంగల్ సమీపంలో కరీమాబాద్. నాన్న రాజు ఆటోడ్రైవర్, అమ్మ గృహి ణి. పదోతరగతిలో 565మార్కులు సాధించాను. పాలిసెట్‌లో మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ర్యాంకు సాధించడంలో నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల సహకారం ఎంతో ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావటమే నా లక్ష్యం.
- నామాల లోకేష్, ఎంపీసీ ఫస్ట్ ర్యాంకర్