కుక్కల దాడిలో చిన్నారి మృతి... సుమోటోగా హెచ్‌ఆర్‌సీ కేసు
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:59 AM
ఇటుక బట్టీ వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటనను..
పెద్దపల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇటుక బట్టీ వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ)తీవ్రంగా పరిగణించింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి విచారణ జరిపి సుమోటోగా కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో పని చేసేందుకు ఒడిశాకి చెందిన బాబుర్ బెహరా, సరస్వతీ దంపతులు ఏడాది కోసం వలస వచ్చారు. వీరి రెండో కుమార్తె దివ్య బెహరా (3) బట్టీ వద్ద ఉన్న నివాస ప్రాంతంలో సోమవారం ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. శరీరంపై 300కు పైగా గాయాలయ్యాయి. సుల్తానాబాద్ ఆసుపత్రికి ఆ పాపను తరలించే లోపు మృతి చెందింది. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలని కమిషన్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణకు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.