Share News

భద్రాచల ఆలయాభివృద్ధికి 300 కోట్లయినా వెచ్చిద్దాం

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:55 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మరింత సర్వాంగ సుందరంగా మారనుంది. ఆలయాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి రూ.300 కోట్ల నిధులు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

భద్రాచల ఆలయాభివృద్ధికి 300 కోట్లయినా వెచ్చిద్దాం

  • మంత్రులతో సీఎం రేవంత్‌ భేటీలో నిర్ణయం.. దేవాదాయ శాఖ మాస్టర్‌ప్లాన్‌పై చర్చ

  • ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దే యోచన.. రెండు ప్రాకారాల నిర్మాణం, ప్రదక్షిణల దారి విస్తరణ

  • వచ్చే మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి కావాలి

  • పుష్కరాల తర్వాత మళ్లీ పనులు ప్రారంభించండి: రేవంత్‌రెడ్డి

  • శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలానికి ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మరింత సర్వాంగ సుందరంగా మారనుంది. ఆలయాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి రూ.300 కోట్ల నిధులు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖతో సమావేశమై.. భద్రాచల ఆలయ అభివృద్ధికి సంబంధించి దేవాదాయ శాఖ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయం కోసం ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణ, అభివృద్ధి డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.100 కోట్లను మాత్రమే కేటాయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా.. ఈ సమావేశంలో రూ.300 కోట్లనైనా వెచ్చించడానికి సిద్ధపడినట్లు తెలిసింది. ఆలయంలో కొత్తగా రెండు ప్రాకారాలు నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతోపాటు ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణల దారిని మరింత వెడల్పు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది నలువైపులా సరిసమానంగా లేదు. ఒక చోట ఇరుకుగా, మరోచోట ఎక్కువ వెడల్పుతో ఉంది. దీనిని నలుదిక్కులా సరిసమానంగా విస్తరించాలని నిర్ణయించారు. వీటితోపాటు కల్యాణ మండపాలను మరింత అభివృద్ధి చేయడం, ఆలయానికి అవసరమైన ఇతర కట్టడాలను నిర్మించడం వంటి పనులను చేపట్టనున్నారు.


కాగా, ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తి ఆగమ శాస్ర్తాల ప్రకారం భద్రాచల ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. 2027 జూన్‌ 26 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, అప్పటివరకు చేయగలిగిన పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల ప్రణాళిక, అంచనాలను రూపొందించుకుని పనులు ప్రారంభించాలన్నారు. 2027 మార్చి 31 నాటికి తొలి దశ ఆలయ అభివృద్ధి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులను పూర్తి చేయడానికి వీలుగా ఇప్పటినుంచే ప్రణాళికను, అంచనాలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్‌, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 27న భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 04:56 AM