Share News

ప్రశాంతంగా ముగిసిన టీజీ ఈసెట్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:26 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన టీజీ ఈసెట్‌-2026 పరీక్ష శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా ముగిసిన టీజీ ఈసెట్‌

  • రాష్ట్రవ్యాప్తంగా 95.94 శాతం హాజరు

ఉస్మానియా యూనివర్సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన టీజీ ఈసెట్‌-2026 పరీక్ష శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో (లేటరల్‌ ఎంట్రీ) ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 18,626 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 17,870 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 95.94గా నమోదైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్‌, టీజీ ఈసెట్‌-2026 కన్వీనర్‌, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రిన్సిపాల్‌ పి.చంద్రశేఖర్‌లు డిజిటల్‌ పాస్‌వర్డ్‌ను విడుదల చేసి పరీక్షను ప్రారంభించారు. ఈ పరీక్ష నిర్వహణలో టీసీఎస్‌ ఆన్‌లైన్‌ సమర్థంగా పనిచేసిందని అధికారులు తెలిపారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్‌ బృందాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఓయూ వీసీ అభినందించారు.

Updated Date - May 16 , 2026 | 04:26 AM