Share News

Telangana Govt: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో 10శాతం కోత!

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:01 AM

తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వోద్యోగుల జీతాల్లో 10 శాతం కోత వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Telangana Govt: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో 10శాతం కోత!

  • ప్రభుత్వోద్యోగులూ జర జాగ్రత్త.. ఆ సొమ్ములు

  • తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేలా చట్టం తెస్తాం: సీఎం రేవంత్‌

  • దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

  • ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వోద్యోగుల జీతాల్లో 10 శాతం కోత వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాంటి వారి వేతనం నుంచి ఈ మొత్తాన్ని కట్‌ చేసి, తల్లిదండ్రులకు అందించేలా చట్టం చేస్తామని తెలిపారు. సోమవారం ఆయన ప్రజాభవన్‌లో బాల భరోసా పథకం, వయోవృద్ధుల ప్రణామ్‌ డే కేర్‌ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వారికి రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల కోటాను అమలు చేస్తున్నామని, దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించామని తెలిపారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పారాలింపిక్స్‌లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా మన్ననలు పొందిన కేంద్ర మాజీ మంత్రి, దివంగత జైపాల్‌రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి అని సీఎం అన్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్లలో కో-ఆప్షన్‌ సభ్యులుగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను నామినేట్‌ చేయాలని యోచిస్తున్నామని తెలిపారు.


తద్వారా వారి సమస్యలపై మాట్లాడుకునే అవకాశం కలుగుతుందన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్‌ పేరుతో డే కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని రేవంత్‌ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతి నెలా వారి జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే తమ విధానమని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఆరోగ్య విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందని, ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్‌ చైర్లు, ల్యాప్‌టా్‌పలు, వినికిడి యంత్రాలు, మొబైల్‌ ఫోన్లు, ఇతర అత్యాధునిక పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు.


మాది మనసున్న ప్రభుత్వం: భట్టి

తమది మనసున్న ప్రభుత్వమని, అందుకే సమాజంలోని అన్ని రకాల సమస్యలకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్‌ పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం అంటే గతంలో కొన్ని శాఖలకే నిధులు మంజూరు చేసేవారని, తమ ప్రభుత్వం దివ్యాంగులతో పాటు అన్ని శాఖల సంక్షేమానికీ నిధులు కేటాయిస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో వికలాంగుల కార్పొరేషన్‌కు రూ.64 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్‌ రెండేళ్లలోనే రూ.100 కోట్లు కేటాయించిందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య చెప్పారు. తొలి విడతగా 8 వేల మంది దివ్యాంగులకు పరికరాల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని.. నెల రోజుల్లోపు మిగిలిన అందరికీ పంపిణీ పూర్తిచేస్తామని తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 06:03 AM