ఎన్‌టీపీసీ విద్యుత్ ఒప్పందంలో మార్పులు చేయండి
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:41 AM
ఎన్‌టీపీసీ తెలంగాణ థర్మల్ పవర్ ప్లాంట్ (రెండో దశ) నుంచి 800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
డిస్కమ్‌లకు టీజీఈఆర్‌సీ ఆదేశం
నిర్మాణ వ్యయంపై సీఈఆర్‌సీ వద్ద గట్టిగా వాదించాలని సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీ తెలంగాణ థర్మల్ పవర్ ప్లాంట్ (రెండో దశ) నుంచి 800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో(పీపీఏ) మార్పులు చేయడంతో పాటు, నిర్మాణ వ్యయం విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) వద్ద గట్టిగా వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. ఈ విద్యుత్ కొనుగోలుపై ఎటువంటి అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవనే నిబంధనను పీపీఏలో చేర్చాలని సూచించింది. ఇక ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పెరిగిందని చూపడంపై ఈఆర్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కచ్చితమైన లెక్కల కోసం సీఈఆర్‌సీ వద్ద బలమైన వాదనలు వినిపించాలని డిస్కంలను ఆదేశించింది.