Share News

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:01 AM

తాము చెప్పిన మాట వినడం లేదంటూ పదో తరగతి విద్యార్థులు.. 8, 9వ తరగతుల విద్యార్థులపై అర్ధరాత్రి దాడికి దిగారు.

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

  • 8, 9వ తరగతి విద్యార్థులపై టెన్త్‌ విద్యార్థుల

  • దాష్టీకం.. చొప్పదండి బీసీ గురుకులంలో ఘటన

గంగాధర, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తాము చెప్పిన మాట వినడం లేదంటూ పదో తరగతి విద్యార్థులు.. 8, 9వ తరగతుల విద్యార్థులపై అర్ధరాత్రి దాడికి దిగారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చొప్పదండి మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నైట్‌ డ్యూటీ ఉపాధ్యాయుడు, వాచ్‌మన్‌ నిద్రించిన తర్వాత.. రెండోఅంతస్తులో ఉండే 15 మంది టెన్త్‌ విద్యార్థులు.. 30 మంది జూనియర్‌ విద్యార్థులపై విచక్షణారహితంగా చేతి కడియాలతో దాడులు చేశారు. భయంతో తొమ్మిదవ తరగతి విద్యార్థి అనిరుధ్‌ మాధవన్‌ రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. బాధిత విద్యార్థుల్లో ఒకరి పుట్టినరోజు శనివారం కావడంతో అతడిని చూసేందుకు తల్లిదండ్రులు ఉదయమే పాఠశాలకు వచ్చారు. దీంతో ఆ విద్యార్థి రాత్రి జరిగిన విషయాన్ని రోదిస్తూ తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిపి ఉపాధ్యాయులను నిలదీశారు. వారందరూ పాఠశాలకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తహసీల్దార్‌ రజిత గురుకులానికి చేరుకుని సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.

Updated Date - Apr 05 , 2026 | 07:05 AM