Share News

kumaram bheem asifabad-పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:04 PM

పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రెగ్యూలర్‌ 6,943 మందికి గాను, 6,924 మంది హాజరయ్యారు. అలాగే ప్రైవేటులో 29 మందికి గాను 23 మంది హాజరు కాగా అరుగురు గైర్హజరయ్యారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందు చేరుకున్నారు. ప

kumaram bheem asifabad-పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ఆసిఫాబాద్‌లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రెగ్యూలర్‌ 6,943 మందికి గాను, 6,924 మంది హాజరయ్యారు. అలాగే ప్రైవేటులో 29 మందికి గాను 23 మంది హాజరు కాగా అరుగురు గైర్హజరయ్యారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాలలో తమకు కేటాయించిన గదులను పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ కె హరిత తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఈవో లలిత సైతం పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని అదికారులకు సూచించారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 402 మంది పరీక్షలకు హాజరయ్యారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసిపర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. హాల్‌టికెట్‌ పరిశీలన అనంతరం విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శనివారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 16వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట పరీక్ష ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులు, ఇన్విజిలేటర్లు, తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఫాతిమాకాన్వెంట్‌, జడ్పీ పాఠశాల, శిశు మందిర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను తనిఖీ చేసిన తరువాత లోనికి పంపించారు. పరీక్షా కేంద్రాలను డీఎస్పీ వహీదుద్దీన్‌ తనిఖీ చేశారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 16 మంది విద్యార్థులు, కేజీబీవీ పాఠశాల సెంటర్‌లో 185 మంది విద్యార్థులు మొదటి పరీక్షలు రాశారు. మండలంలో 290 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి గైర్హాజరు అయినట్లు ఎంఈవో జయరాజు తెలిపారు. పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌గా బండయ్య, డీఓగా ఊశన్న, చీఫ్‌ సూపరింటెండెంట్‌గా రామయ్య, భీమయ్యలు వ్యవహరించారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కేజీబీవీలో 111, ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో 170 మంది పదో తరగతి పరీక్షకు హాజరయ్యారని ఎంఈవో శ్రీనివాస్‌ తెలిపారు. సీఎస్‌లు శ్రీనివాస్‌, అమరేందర్‌రెడ్డి, డీఓలు తిరుపతయ్య, శ్రీనివాస్‌లు విధులు నిర్వహించారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 168 మందికి గాను ఒక్క గైర్హాజరు కాగా మోడి ఆశ్రమ పాఠశాలలో 170 మందికి గాను అందరు హాజరైనట్లు ఎంఈవో ప్రకాష్‌ తెలిపారు. వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్‌లు పరీక్షా కేంద్రాల వద్ద బందో బస్తును పర్యవేక్షించారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందో బస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ఎంఈవో తనిఖీ చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 11:04 PM