క్యాతన్‌పల్లిలో ఉద్రిక్తం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:41 PM
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీవద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట
పాలకవర్గ ప్రమాణ స్వీకారం వాయిదా
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీవద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం లోనికి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలకు తోపులాట జరిగింది. తాము వాహనాల్లోనే లోనికి వెళ్తామంటూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, లేదు నడిచే వెళ్లాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారం సోమవారం వాయిదా పడింది. నిర్దిష్టమైన సమయానికి కోరం సభ్యులు హాజరుకాకపోవడంతో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసినట్లు మందమర్రి తహసీల్దార్ సతీష్ తెలిపారు. దీంతో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధికారుల తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసేందుకే మంత్రి వివేక్ వెంకటస్వామి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కసుమన్‌ను అరెస్టు చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గోబ్యాక్ బాల్కసుమన్ అంటూ కాంగ్రెస్ నాయకులంతా మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్క సారిగా పరిస్థితులు చేజారుతున్నట్లు అయింది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు. పోలీసుల తీరుపై డీసీసీ అధ్యక్షుడు డీజీపీకి, ఐజీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.