అడ్లూరు గ్రామసభలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:33 AM
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది.
సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయుల ఘర్షణ
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘటన
కోదాడ రూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అడ్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గువ్వల శిరీష అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు గ్రామసభలో ఆమోదం తెలిపారు. సభ ముగిసిన అనంతరం ఉపసర్పంచ్ భర్త కొండలు అదే గ్రామానికి చెందిన పింగళి సైదిరెడ్డి, మరికొంతమంది మాట్లాడుతూ రూ.5లక్షలతో ఎక్కడెక్కడ పనులు చేపట్టారో వివరించాలని సర్పంచ్‌ను కోరారు. సర్పంచ్ శిరీష మాట్లాడుతూ రూ.5లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు గత పంచాయతీ సమావేశంలోనే ఆమోదం పొందామన్నారు. జరిగిన గ్రామసభలో ఇదే విషయా న్ని వివరించామని, మరలా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలోని దేవాలయం నిర్మాణానికి సంబంధించిన అంశంపై వాగ్వాదం జరగటంతో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయులు ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని, కర్రలతో దాడి చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సర్పంచ్ గువ్వల శిరీష, ఉపసర్పంచ్ ఉసిరికాయల శిరీష వర్గాలు ఒకరిపైఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై సర్పంచ్, సర్పంచ్ భర్త వెంకట్, ఉపసర్పంచ్, ఉపసర్పంచ్ భర్త కొండలు, మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.