Share News

తాత్కాలికమా..? విలీనమా..?

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:46 AM

చీకట్లో కాంతిపుంజంగా వెలిగిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘానికి చీకట్లు అలుముకుంటున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం అంధకారంలో నిండి ఉండేది. పొద్దు గూకిందంటే చాలు ప్రజలు బయటకు వెళ్లడానికి జంకేవారు. గ్రామాల్లో చుట్టూ చెట్లు, గుట్టలు

తాత్కాలికమా..? విలీనమా..?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చీకట్లో కాంతిపుంజంగా వెలిగిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘానికి చీకట్లు అలుముకుంటున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం అంధకారంలో నిండి ఉండేది. పొద్దు గూకిందంటే చాలు ప్రజలు బయటకు వెళ్లడానికి జంకేవారు. గ్రామాల్లో చుట్టూ చెట్లు, గుట్టలు ఉండడంతో గాడాంధకారం నిండి ఉండేది. ఏవైపు నుంచి ఏమి వస్తుందోనని భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్లదీసే రోజులు ఉండేవి. ప్రభుత్వం విద్యుత్‌ బోర్డ్‌ ద్వారా విద్యుత్‌ను అందించిన సేవలు సక్రమంగా ఉండేవి కావు. సమస్యలను తెలపాలంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్న కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యలను అధిగమించడానికి సిరిసిల్ల ప్రాంత రైతులు, ప్రజలందరూ ఒకటయ్యారు. చీకట్లను తరిమివేయడం కోసం సిరిసిల్ల విద్యుత్‌ సహకార సరఫరా సంఘాన్ని స్థాపించుకున్నారు. 1969-1970 నుంచి మొదలైన సెస్‌ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా వెలుగునీడలను పంచుతూ వస్తోంది. ఇదే దశలో అవినీతి ఆరోపణలు, ఏకంగా ప్రైవేటీకరణ, విద్యుత్‌ సంస్థల్లో విలీనం కుట్రలతోను పోరాడుతూ వస్తోంది. చివరకు విలీనం తప్పదనే పరిస్థితి వచ్చినట్లుగా తేలిపోయింది. కొద్ది రోజులుగా సిరిసిల్ల సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో కలపాలని కొందరు, వద్దని మరికొందరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు విలీనమే నెగ్గినట్లుగా భావిస్తున్నారు. సిరిసిల్ల విద్యుత్‌ సహకార సరఫరా సంఘానికి ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా కోసం ఇచ్చిన లైసెన్స్‌ను ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు విద్యుత్తు పంపిణీ సంబంధించి ప్రభుత్వం లైసెన్స్‌ పొడిగిస్తూ రెన్యూవల్‌ చేస్తుంది. కొద్ది రోజులుగా ఎన్పీడీసీఎల్‌లో సెస్‌ను కలపాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉండడంతోనే ఈసారి లైసెన్స్‌ రెన్యూవల్‌ కాలేదని భావిస్తున్నట్లుగానే సిరిసిల్ల సెస్‌ పరిధిలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం ఎన్పీడీసీఎల్‌కు అప్పగించింది. బుధవారం ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సిరిసిల్లలో సెస్‌ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు సిరిసిల్ల సెస్‌ పరిధిలోని విద్యుత్‌ పంపిణీని పూర్తిగా ఎన్పీడీసీఎల్‌ చూస్తుందని ప్రకటించారు. దీంతో కొంతకాలంగా విలీనం చేస్తారనే చర్చకు తెరపడినట్లుగానే భావిస్తున్నారు. ప్రభుత్వం సెస్‌ను విడతలవారీగా పూర్తిగా ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేస్తుందని భావిస్తున్నారు. సెస్‌లో జరుగుతున్న అవినీతి ఆరోపణలకు తోడుగా, ప్రధాన పార్టీల మధ్య మొదలైన రాజకీయల మధ్యనే సెస్‌ బంధం వీడిపోతుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుతం ఎన్పీడీసీఎల్‌ సాఽ్వదీనంలోకి వెళ్లిన సెస్‌ విలీనం అవుతుందా.. తాత్కాలికంగానే పంపిణీ బాధ్యతలతో ముగుస్తుందా అనే సందిగ్ధత ఏర్పడింది. నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ అప్‌ తెలంగాణ లిమిటెడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ బిల్లులు, విద్యుత్‌ టారిఫ్‌ సవరణల కోసం నిర్వహించిన పలు బహిరంగ విచారణల సందర్భంగా కొంతమంది సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో కలపాలి అనే అంశాన్ని లేవనెత్తుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో సెస్‌ సంస్థలో వ్యాపార నిర్వహణ సరిగా లేదని బిల్లుల చెల్లింపు బకాయిలను సూచిస్తూ 2024-25లో ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేసింది. లెక్కలు ఎలా ఉన్నా సిరిసిల్ల సెస్‌ వినియోగదారులు ఎన్పీడీసీఎల్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా సెస్‌ పరిధిలో విద్యుత్‌ సరాఫరాను ఎన్పీడీసీల్‌కు అప్పగించడంతో లాభాల బాటలో పయనిస్తున్న సెస్‌ను కాపాడుకోవడానికి ఉద్యమాలకు సైతం సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది. సెస్‌ పాలకవర్గం విద్యుత్‌ సరఫరా బాధ్యతలు ఎన్పీడీసీఎల్‌ అప్పగించడం. విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌ రెన్యువల్‌పై సెస్‌ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 4నసెస్‌ మహాసభలో పలు తీర్మానాలు చేసి దాని ప్రకారం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

28 ఏళ్ల క్రితమే సెస్‌ ప్రైవేటీకరణకు యత్నం..

దేశంలో సహకార రంగంలో విద్యుత్‌ వెలుగులు పంచుతున్న గ్రామీణ సహకార విద్యుత్‌ సరఫరా సంస్థలకు 28 ఏళ్ల క్రితం పట్టిన ప్రెవేటీకరణ గ్రహణం వీడడం లేదు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్‌ బోర్డును రెండు ముక్కలుగా చీల్చి జెన్‌కో, ట్రాన్స్‌కోగా విభజించింది. ఇదే క్రమంలో 1998లో ఏర్పాటుచేసిన సుబ్రహ్మణ్యం అధ్యయన కమిటీ గ్రామీణ విద్యుత్‌ సంస్థలను రద్దు చేయడం లేదా ప్రైవేటీకరణకు సిఫార్సు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఏర్పడిన నిరసనలు, ఆందోళనల ఫలితంగా అప్పుటి ప్రభుత్వం వెనకంజ వేసింది. 23జూలై 2002లో జీవో 331 ద్వారా రాష్ట్రంలో 20 సంస్థలను ప్రైవేటీకరించే జాబితాలో తొమ్మిది గ్రామీణ సహకార విద్యుత్‌ సరఫరా సంస్థలను కూడా చేర్చింది. ఆనాటి నుంచి నేటివరకు తరచూ విలీనం వివాదం ముందుకు వస్తూనే ఉంది. సహకార ప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా సంస్థలను ఏర్పాటు చేయాలని 1969లో కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ దేశంలో మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ సొసైటీల్లో 1970లో ఏర్పాటుచేసిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం మొదటిది. దీని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1982లో తొమ్మిది గ్రామీణ సహకార విద్యుత్‌ సరఫరా సంఘాలను నెలకొల్పారు. ప్రస్తుతం ఆంధ్రాలో చిత్తూరు జిల్లా కుప్పం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, తెలంగాణలో సిరిసిల్ల సొసైటీలు మాత్రమే పని చేస్తున్నాయి. మిగిలిన సొసైటీలను విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేశారు. ఎన్‌పీడీసీఎల్‌ సెస్‌ను విలీనం చేసే క్రమంలో సిరిసిల్ల వెలుగుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా నిలబెడుతుందని చర్చించుకుంటున్నారు.

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘంపై జరుగుతున్న విలీనం కుట్రపై ‘ఆంధ్రజ్యోతి’ ముందే తెలిపింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 11న ‘సెస్‌పై విలీనం కుట్ర’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. సెస్‌ విలీనంపై జరుగుతున్న తీరుపై కథనాలు ప్రచురిస్తున్నట్లుగానే బుధవారం సెస్‌ విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండా ఎన్పీడీసీఎల్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

సెస్‌కు గుదిబండగా బకాయిలు..

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘానికి బకాయిలు గుదిబండగా వెక్కిరిస్తున్నాయి. కరెంట్‌ బిల్లుల చెల్లింపులు కాస్త ఆలస్యమైతేనే వినియోగదారులపై అపరాధ రుసుం విధిస్తారు. గడువు దాటిపోతే కనెక్షన్‌ తొలగిస్తారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకుంటే మాత్రం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో సెస్‌ సంస్థ ఉండిపోయింది. ప్రభుత్వం, ఇతర విభాగాల నుంచి సిరిసిల్ల సెస్‌కు రావాల్సిన బకాయిలు అక్షరాలు రూ.871.05 కోట్లు ఉంది. ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు రాక, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు భారంగానే మారాయని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్‌ను 1970లో 420 సర్వీసులతో ప్రారంభమైన సహకార విద్యుత్‌ సరఫరా సంఘంలో ప్రస్తుతం 3 లక్షల 51వేల 772 మంది సభ్యులు ఉన్నారు. వీరి వాటాధనం రూ6.32 కోట్లు ఉండగా, సెస్‌ ఆస్తులు రూ.252.29 కోట్లకు చేరుకున్నాయి. గృహ కనెక్షన్లు 1,71,510, వాణిజ్య కనెక్షన్లు 21,486 కనెక్షన్లు, పరిశ్రమల కనెక్షన్లు 1,528, పవర్‌లూం కనెక్షన్లు 5,635, వ్యవసాయ కనెక్షన్లు 78,611, గ్రామ పంచాయతీ వాటర్‌ కనెక్షన్లు, విద్యుత్‌ దీపాల కనెక్షన్లు 3,118 ఉన్నాయి. విద్యుత్‌ రంగంలోనే ప్రత్యేకతను సాధించిన సెస్‌కు ప్రభుత్వం, వినియోగదారులు, వివిధ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు గుదిబండగా మారాయి. ప్రస్తుతం సెస్‌కు రూ.871.05 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దాదాపు రూ.700 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 50 శాతం సబ్సిడీ బకాయిలు రూ.57.46 కోట్లు, దీనికి సర్‌చార్జిగా రూ.1.33 కోట్లతో కలిపి రూ.58.79 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, వీటికి సంబంధించిన నీటిసరఫరా, వీధి దీపాలకు సంబంధించి 31 జూన్‌ 2020 నాటికి రూ.319.52 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి సంబంధించి రూ.220.11కోట్ల బకాయిలు ఉన్నాయి. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి బిల్లులు రూ.20.27 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాలు, 1,049 ఉండగా, వీటికి సంబంధించి రూ.3.53కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. జిల్లాలో సెస్‌ వినియోగదారుల నుంచి వివిధ కనెక్షన్లకు సంబంధించి రూ.199.15 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న వ్యవసాయదారుల నుంచి సర్వీస్‌ రుసుము కింద బకాయిలు రూ.16.13 కోట్లు రావాల్సి ఉన్నాయి. గృహాలకు సంబంధించి రూ.40.40కోట్లు, కమర్షియల్‌కు సంబంధించి రూ.25.43 కోట్లు, పరిశ్రమలకు సంబంధించి రూ.47.86 కోట్లు, మరమగ్గాల పరిశ్రమ నుంచి రూ4.29 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి.

విద్యుత్‌ సరఫరాకు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌..

- జూన్‌లోగా రైతులకు పెండింగ్‌ విద్యుత్‌ కనెక్షన్లు పూర్తి

- వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా సేవలు

- ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సరఫరాకు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించామని, సెస్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైతులకు విద్యుత్‌ కనెక్షన్లను అందించడం పూర్తి చేస్తామని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సెస్‌కు విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌ రెన్యూవల్‌ కాకపోవడంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా బాధ్యతలను ఎన్పీపీడీసీఎల్‌కు అప్పగించిందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యుత్‌ సేవలు అందిస్తామన్నారు. వినియోగదారులకు మరింత చేరువై వారికి అన్ని కొత్త సర్వీసుల మంజూరు మీ-సేవ కేంద్రాలు, గ్రామాల కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా పేరు మార్పు, కొత్త కనెక్షన్లు ఇతర సేవలను కూడా అందిస్తామని, వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. దీనివల్ల అవినీతి జరగకుండా నిర్మూలించవచ్చని అన్నారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తీసుకున్నామని ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో ఓవర్‌లోడు వంటి సమస్యలు ఉండకుండా కావలసిన ఏర్పాటు చేస్తామని అన్నారు. కావాల్సిన మెటీరియలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తామన్నారు. ఓవర్‌ లోడ్‌ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్సాఫార్మర్ల సామర్ధ్యం పెంచాలని, ఒకే బ్రేకర్‌పై ఉన్న రెండు ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ అంతరాలు తగ్గించాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా లైన్స్‌, ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటనెన్స్‌ చేయాలని, కావాల్సిన మెటీరియల్‌ అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,491 సర్వీసులు పెండింగ్‌ ఉన్నాయని, వీటిని రాబోయే మూడు నెలల్లో నెలవారీగా టార్గెట్‌ అనుగుణంగా యుద్ధప్రాతిపదికన మంజూరుచేస్తామని అన్నారు. తెలంగాణ వ్యాపంగా అమలవుతున్న యూనిఫామ్‌ సర్వీస్‌ లైన్‌ చార్జెస్‌ (ఎస్‌ఎల్‌సీ) ఎల్‌టీలో ఒక కిలోమీటర్‌లోపు వ్యవసాయ, గృహ, పరిశ్రమల వినియోగదారులకు మేలు చేకూరే విధంగా తీసుకువచ్చిన టీజీ ఈఆర్‌సీ రెగ్యులేషన్‌ను సెస్‌ పరిధిలో కూడా అమలు చేయాలన్నారు. యూనిఫామ్‌ సర్వీస్‌ లైన్‌ ఛార్జెస్‌ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు. వ్యవసాయ వినియోగదారులకు ఈ విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఒక కిలోవాట్‌కు కేవలం రూ.వెయ్యి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యుత్‌ కనెక్షన్‌ పొందడం మరింత సులభం, వేగవంతంగా పారదర్శకంగా మారిందని తెలిపారు. విద్యుత్‌ భద్రతకు పెద్దపీట వేస్తూ వారి భద్రతకు భరోసా కల్పించే ఎన్పీడీసీఎల్‌లో అమలవుతున్న రూ.కోటి ప్రమాద బీమా, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సెస్‌ ఉద్యోగులకు కూడా కల్పిస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో దోహదపడుతున్న రియల్‌ టైం ఫీడర్‌ మేనేజ్మెంట్‌ సిస్టం, ఫాల్ట్‌ ప్యాసేజీ ఇండికేటర్లను అమలు చేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా నిరంతరం మానిటర్‌ చేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా గంట గంటకు విద్యుత్‌ సరఫరా తీరుతెన్నులను తెలుసుకోవచ్చని అన్నారు. వినియోగదారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్‌ అధికారులు ప్రభాకర్‌, కిషన్‌, రవీందర్‌, అశోక్‌, సెస్‌ ఎండీ బిక్షపతి ఉన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 01:46 AM