Temple Robbery: ఆలయంలో దొంగలు.. రూ.50 లక్షల సొత్తు చోరీ
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:34 AM
కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో ఇద్దరు దొంగలు పడ్డారు.
సర్దార్‌పటేల్ నగర్‌లోని వేంకటేశ్వరస్వామి గుడిలో ఘటన
హైదర్‌నగర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో ఇద్దరు దొంగలు పడ్డారు. కూకట్‌పల్లి జోన్ ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, స్థానికులు, సీసీ ఫుటేజీ వివరాల ప్రకారం.. ఆలయం వద్దకు బైక్‌పై చేరుకున్న దొంగలు, దక్షిణం వైపు గేటు రాడ్డు తొలగించారు. ఒకరు అక్కడే కాపలా ఉండగా మరో దొంగ లోపలికి ప్రవేశించాడు.. గర్భాలయం తలుపులకు వేసిన తాళం పగులగొట్టకుండా రాడ్‌తో గొళ్లెం తొలగించాడు. స్వామి, అమ్మవార్లకు అలంకరించిన 15 తులాల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలు, 3 వెండి విగ్రహాలు, ఒక పంచలోహ విగ్రహం సంచీలో వేసుకుని వెళ్లాడు. అరగంటలో చోరీ పూర్తి చేసుకుని ఇద్దరు దొంగలు అదే బైక్‌పై వెళ్లిపోయారు. ఉదయం తలుపు గొళ్లెం తీసి ఉండటాన్ని చూసిన అర్చకులు ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి దొంగల కోసం గాలిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు, విగ్రహాలు తస్కరించారని, ఇద్దరు దొంగలు స్కూటీపై వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని విగ్రహాలను ఆభరణాలతో అలంకరించినట్టు, మరో నాలుగు రోజుల్లో గోదా కల్యాణం ఉండటంతో ఆభరణాలు అలానే ఉంచినట్టు సమాచారం. ఆలయం చుట్టూ సోలార్ కరెంట్ ఫెన్సింగ్, 16 సీసీటీవి కెమెరాలు, సెక్యూరిటీ గార్డు పహరా ఉన్నా చోరీ జరగటం పోలీసులను సైతం విస్మయపరచింది.