కథ, నవలా రచయిత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:47 AM
ప్రముఖ కథా, నవలా రచయిత, గ్రామీణాభివృద్ధి సంస్థ విశ్రాంత ప్రాజెక్టు డైరెక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (97) కన్నుమూశారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా, నవలా రచయిత, గ్రామీణాభివృద్ధి సంస్థ విశ్రాంత ప్రాజెక్టు డైరెక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (97) కన్నుమూశారు. కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ, శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన నారాయణరావు, ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవికి స్వయానా సోదరుడు. 1951లో రాసిన ‘తీగతెచ్చిన సంపద’ కథతో సాహిత్య ప్రస్థానం ప్రారంభించి.. వనశ్రీ, నరేంద్ర, రహింషా కలం పేర్లతో వందకు పైగా కథలు రాశారు. ‘రత్నగర్భ’, ‘శ్రీవారి శ్రమదానం’, ‘కురుక్షేత్రం’ పేరుతో కథల సంపుటాలు వెలువరించారు. నరేంద్ర పేరుతో ‘మంత్రాల మర్రి’, ‘మొండిచెయ్యి’, ‘పీపాలో శవం’, ‘కాలభైరవుడు’ వంటి 16 డిటెక్టివ్ నవలలు రాశారు. వాసిరెడ్డి సీతాదేవి ఫౌండేషన్ నెలకొల్పి, ఆమె సంపూర్ణ రచనలు సంపుటాలుగా ప్రచురించడంతో పాటు గ్రంథాలయాలు నెలకొల్పి పలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.