తెలుగు వర్సిటీలో వేసవి శిక్షణ తరగతులు
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:37 AM
యువత, విద్యార్థుల్లోని సృజనను వెలికితీసే లక్ష్యంతో.. సినీ నటనతో పాటు లలితకళల్లోనూ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నిర్ణయించింది.
సినీ నటన, లలితకళల్లో ప్రత్యేక కోర్సులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్7 (ఆంధ్రజ్యోతి): యువత, విద్యార్థుల్లోని సృజనను వెలికితీసే లక్ష్యంతో.. సినీ నటనతో పాటు లలితకళల్లోనూ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు 30 రోజుల శిక్షణ కార్యక్రమాలను బాచుపల్లి ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు వెల్లడించారు. వర్సిటీలోని రంగస్థల శాఖ అధ్యాపకుల పర్యవేక్షణలో సినీ నటన కోర్సును మే 2 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులో అభినయ పాఠాలు, హావభావాలు, సంభాషణ తీరు, వేదికపై ప్రదర్శన, పాత్ర ఆవిష్కరణ, శరీర భాష తదితరాలపై ప్రాయోగిక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. లలితకళల విభాగంలో చిత్రలేఖనం, శిల్పకళ, ప్రింట్ మేకింగ్ అంశాల్లోనూ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రిజిస్ర్టార్ తెలిపారు. సినీ నటన కోర్సుకు రూ.5వేలు, ఫైన్ ఆర్ట్స్‌కు రూ.3వేలు ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు ఫోన్ 9346461733, 8301011865 లో సంప్రదించాలన్నారు.