అక్రమ వలసల ఉచ్చులో తెలుగు రాష్ట్రాలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:17 AM
ఉద్యోగాలు పేరిట అక్రమంగా విదేశాలకు చేరుకుని మోసపోతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతే అత్యధికంగా ఉన్నట్లు తేలింది.
3, 294 ఫిర్యాదులతో ఏపీ టాప్
నాలుగో స్థానంలో తెలంగాణ.. కేంద్ర హోంశాఖ గణాంకాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు పేరిట అక్రమంగా విదేశాలకు చేరుకుని మోసపోతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతే అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అక్రమ వలసదారుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని కేంద్ర హోం శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విజిట్ టూ ఎంప్లాయ్‌మెంట్ వీసాల పేరిట గల్ఫ్ దేశాలకు చేరుకుని అక్కడి నుంచి కాంబోడియా,మయన్మార్‌లోని సైబర్ క్రిమినల్స్ ముఠాలకు చిక్కుతున్నారు. పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలను దాటి తెలుగు యువత ఈ ఊబిలో చిక్కుకుపోవడం ఆందోళనకర పరిణామమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. 2021 నుంచి దేశవ్యాప్తంగా అక్రమ ఇమిగ్రేషన్‌కు సంబంధించి 6,700 ఫిర్యాదులు అందగా, అందులో 3,294 ఫిర్యాదులు ఒక్క ఆంధ్రప్రేదశ్ నుంచే రావడం గమనార్హం. గతేడాది ఏపీ నుంచి అక్రమ ఇమిగ్రేషన్‌కు సంబంధించిన 448 సంఘటనలు నమోదు కాగా, తెలంగాణ నుంచి 111 ఫిర్యాదులు వచ్చాయి.