Share News

ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానం

ABN , Publish Date - May 26 , 2026 | 05:14 AM

న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...

ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానం

  • ధర్మేంద్ర, రాజామ్‌కు పద్మ విభూషణ్‌

  • ఆరుగురు తెలుగు ప్రముఖులకు ‘పద్మశ్రీ’

  • తెలంగాణ నుంచి నలుగురికి ప్రదానం

  • రాష్ట్రపతిభవన్‌లో వైభవంగా కార్యక్రమం

న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను అందజేశారు. తొలివిడతలో భాగంగా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. వీటిలో రెండు పద్మ విభూషణ్‌, ఆరు పద్మ భూషణ్‌, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మిగతా వారికి రెండో విడతలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. బాలీవుడ్‌ దివంగత నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్‌ రాగా, ఆయన తరపున భార్య హేమమాలిని అవార్డును అందుకున్నారు. ప్రముఖ వయోలిన్‌ విద్వాంసురాలు ఎన్‌.రాజమ్‌ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. పద్మభూషణ్‌ అందుకున్న వారిలో డాక్టర్‌ గణేష్‌, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం భగత్‌సింగ్‌ కోశ్యారీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకులు ఉదయ్‌ సురేష్‌ కుమార్‌ కోటక్‌, ప్రొ. విజయ్‌కుమార్‌ మల్హోత్రా(మరణాంతరం),గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ రామసామి పళనిస్వామి, పీయూష్‌పాండే (మరణానంతరం), మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సోమవారం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న వారిలో తెలంగాణ నుంచి డాక్టర్‌ గూడురు వెంకట్‌రావు (వైద్యం), దీపికా రెడ్డి(కళలు), పాలకొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి(వైద్యం), ఢిల్లీ నుంచి ఎంపికైన యూజీసీ మాజీ చైర్మన్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌ (సాహిత్యం, విద్య) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌(కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం, విద్య) ఉన్నారు. కాగా, 2026 సంవత్సరానికి గానూ 5 పద్మ విభూషణ్‌, 13 పద్మ భూషణ్‌, 113 పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండు మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి చంద్రమౌళి గడ్డమనుగు, దీపికారెడ్డి, గూడురు వెంకట్‌రావు, కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం, కుమారస్వామి తంగరాజ్‌, పాలకొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి, మామిడి రామ రెడ్డి(మరణాంతరం) ఎంపికవగా.. ఏపీ నుంచి గద్దె రాజేంద్రప్రసాద్‌, గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ (మరణాంతరం), మాగంటి మురళీమోహన్‌, వెంపటి కుటుంబశాస్త్రి పద్మశ్రీకి ఎంపికయ్యారు.

Updated Date - May 26 , 2026 | 05:14 AM