Share News

విదేశాలకు చలో!

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:46 AM

ఒకప్పుడు విదేశీ యాత్ర అంటే పెద్ద కల.. కోట్ల ఆస్తులున్నవారికో, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకో మాత్రమే అన్నట్టుండే అపురూప ప్రయాణం..

విదేశాలకు చలో!

  • తెలుగు రాష్ట్రాల వారిలో కొత్త ట్రెండ్‌

  • ఇన్నాళ్లూ గల్లీదాటని వారు కూడా..ఇప్పుడు గ్లోబల్‌ బీచ్‌ల్లో బిజీ

  • కోనసీమ రైతు నుంచి సూర్యాపేట వ్యాపారి వరకు

  • అవకాశం దొరికితే విమానం ఎక్కడమే!

  • ఊటీ, కొడైకెనాల్‌ ఖర్చుతోనే బ్యాంకాక్‌, వియత్నాం, ఇండోనేషియా టూర్లు

  • రూ.40 వేల నుంచే విదేశీ యాత్రలు అందిస్తున్న పర్యాటక సంస్థలు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు విదేశీ యాత్ర అంటే పెద్ద కల.. కోట్ల ఆస్తులున్నవారికో, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకో మాత్రమే అన్నట్టుండే అపురూప ప్రయాణం.. అయితే తిరుపతికో, షిర్డీకో.. మహా అయితే ఉత్తర భారత యాత్రలతోనో సరిపెట్టుకునేవారు. కానీ ఇన్నాళ్లూ గల్లీ దాటడానికి సంకోచించిన జనం.. ఇప్పుడు విదేశీ బీచ్‌లలో బిజీగా గడుపుతున్నారు. కాస్త మొత్తాన్ని భరించగలిగిన వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, కొత్త జంటలు, కొన్నిసార్లు గ్రూపులుగా మహిళా సంఘాల వారు సైతం విదేశీ విహార యాత్రలకు క్యూ కడుతున్నారు. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన విమాన సర్వీసులు, తక్కువ ధరలోనే జాతీయ, అంతర్జాతీయ టూరిస్టు సంస్థలు అందిస్తున్న పర్యాటక ప్యాకేజీలు, విదేశీ పర్యటనలపై పెరిగిన ఆసక్తి, సోషల్‌ మీడియా ప్రభావం, వాయిదాల్లో సొమ్ము చెల్లించే అవకాశం వంటివి ఈ మార్పుకు కారణమవుతున్నాయి. గత నాలుగైదేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ బుకింగ్స్‌ ఊహించని రీతిలో పెరిగాయని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు.

థాయ్‌లాండ్‌ టాప్‌..ఆపై బాలి, వియత్నాం

తెలుగు పర్యాటకుల్లో చాలా మంది ఆగ్నేయాసియా (సౌత్‌ ఈస్ట్‌ ఆసియా) దేశాలకు వెళుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. భారతీయ పర్యాటకుల్లో ఎక్కువ మంది థాయ్‌లాండ్‌కు వెళుతున్నారు. 2025లో రికార్డు స్థాయిలో 24.8 లక్షల మంది భారతీయులు ఆ దేశంలో పర్యటించారు. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియాలోని బాలి, శ్రీలంక, వియత్నాం, కాంబోడియా, సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌, మాల్దీవులు ఉన్నాయి. ఇటీవలికాలంలో జార్జియా, అజర్‌బైజాన్‌ వంటి దేశాలకూ తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వెళుతున్నారు.


దేశీయ టూర్‌ కంటే విదేశీ టూర్‌ చౌక!

ట్రావెల్‌ సంస్థల లెక్కల ప్రకారం.. ఒక మధ్యతరగతి కుటుంబం కశ్మీర్‌, కేరళ లేదా ఊటీ వంటి పర్యటనలకు వెళ్లేందుకు ఫ్లైట్‌ టికెట్లు, హోటల్‌ వసతి, ఇతర ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ రూ.40వేల దాకా ఖర్చవుతోంది. అదే కాస్త అటూ ఇటూ ఖర్చు పెడితే విదేశాల్లో పర్యటించే అవకాశం ఉంటోంది. థాయ్‌లాండ్‌/వియత్నాం/శ్రీలంక ప్యాకేజీలు రూ.38-46వేలు (4 నుంచి 6 రోజులు), మలేషియా/సింగపూర్‌/దుబాయ్‌ ప్యాకేజీలు రూ.60-75వేలు (5 నుంచి 7 రోజులు), శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌, కంబోడియా, వియత్నాం వంటి ఐదు దేశాలకు రూ.1.39లక్షల వరకు (10 రోజులు) ధరలో ప్యాకేజీలు ఉంటున్నాయి. రానుపోను విమాన టికెట్లు, త్రీస్టార్‌ హోటళ్లల్లో వసతి, ప్రతి రోజు బ్రేక్‌ఫాస్ట్‌, ఎయిర్‌పోర్ట్‌ పికప్‌, డ్రాప్‌, స్థానిక సైట్‌సీయింగ్‌, ప్రత్యేక టూర్‌ గైడ్‌, వీసా సహాయం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ వంటివన్నీ అందులో ఉంటుండటం గమనార్హం. పైగా మన భోజనం దొరికే ఏర్పాట్లు ఉంటున్నాయి. దీనితో పట్టణాల వారే కాదు, గ్రామీణ ప్రాంతాల వారూ విదేశీ యాత్రలపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల వారి నుంచి బుకింగ్స్‌ బాగా పెరుగుతున్నాయని విజయవాడకు చెందిన శ్రీవైష్ణవి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఆర్గనైజర్‌ గొల్లు కుమార్‌ తెలిపారు. ముఖ్యంగా పంటలు చేతికొచ్చిన తరుణంలో కోనసీమ, గుంటూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ వంటి ప్రాంతాల రైతులు గ్రూపులుగా విదేశీ యాత్రలు ప్లాన్‌ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇక విదేశాల్లో స్థిరపడినవారు తమ తల్లిదండ్రులకు, తోబుట్టువుల కోసం విదేశీ పర్యటనలు బుక్‌ చేస్తుండటమూ పెరిగింది. పెద్ద వయసు వారికి తగిన సదుపాయాలు, తోడుగా ఒక మెడికల్‌ అసిస్టెంట్‌ వంటి ఏర్పాట్లతో గ్రూపులుగా విదేశీ పర్యటనలకు ప్లాన్‌ చేస్తున్న ధోరణి కనిపిస్తోంది.


థాయ్‌లాండ్‌ వెళ్లొచ్చాం..

గత ఏడాది వరి కోతలు అయిపోయిన తర్వాత నలుగురు స్నేహితులం కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నాం. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న మా అబ్బాయి థాయ్‌లాండ్‌ ప్యాకేజీ బుక్‌ చేశాడు. ఒక్కొక్కరికి రూ.42వేలు ఖర్చయింది. బ్యాంకాక్‌, పట్టాయాలో పర్యటించి వచ్చాం. చాలా కొత్తగా అనిపించింది. ఊరొచ్చాక అంతా మమ్మల్సి ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ సంతోషమే వేరు

- కె.సత్యనారాయణ, అమలాపురం

కిరాణా షాప్‌.. ఈఎంఐ టూర్‌!

నాకు సూర్యాపేటలో చిన్న కిరాణా షాప్‌ ఉంది. ఏటా ఎండాకాలం సెలవుల్లో వైజాగ్‌కో, తిరుపతికో వెళ్లేవాళ్లం. ఈసారి మా ఆవిడ ఇన్‌స్టాలో వియత్నాం వీడియోలు చూసి వెళ్దామని పట్టుబట్టింది. అంత సొమ్ము లేదన్నాను. కానీ హైదరాబాద్‌లోని ఒక ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు నెలకు రూ.3,500 చొప్పున ఈఎంఐ కట్టే అవకాశం ఇచ్చారు. 5 రోజులు వియత్నాం క్రూజ్‌లో తిరిగి వచ్చాం. పిల్లలు చేసిన రీల్స్‌ చూసి మా బంధువులంతా ఆశ్చర్యపోయారు.

- ఎం.వెంకటేశ్‌, సూర్యాపేట

మలేషియా టూర్‌ వెళ్లాం

ముత్తాతల కాలం నుంచీ మా కుటుంబంలో ఎవరూ విమానం ఎక్కలేదు. ఏటా పంట చేతికొచ్చాక యాదగిరిగుట్టకో, భద్రాచలమో వెళ్లే వాళ్లం. ఈసారి మామిడి తోటల లీజు డబ్బులు బాగా వచ్చాయి. మా ఊరి సర్పంచ్‌ వాళ్లు గ్రూపుగా మలేషియా, సింగపూర్‌ టూర్‌ వెళుతున్నారని తెలిసి.. నేను, మా ఆవిడ కూడా పాస్‌పోర్ట్‌లు చేయించుకుని వాళ్లతో కలిసి వెళ్లాం. ఇలా వెళతానని ఎన్నడూ ఊహించలేదు.

- బోయినపల్లి నర్సింహారావు, ఖమ్మం


రిటైర్మెంట్‌ ఫండ్‌తో.. విహారం

నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైరయ్యాను. ఏదైనా కొత్త ప్రదేశం చూడాలనుకున్నాం. మా పిల్లలు వియత్నాం టూర్‌ బుక్‌ చేశారు. ఒక్కొక్కరికి రూ.45 వేలు ఖర్చయింది. అక్కడ విమానాశ్రయంలో దిగగానే వీసా ఇచ్చారు. 5 రోజులు రాయల్‌ క్రూయిజ్‌ (నౌక)లో ప్రయాణించాం. చపాతీలు, అన్నం దొరికాయి. తక్కువ ఖర్చులోనే టూర్‌ పూర్తిచేయడం తృప్తినిచ్చింది.

- పి.కృష్ణమూర్తి, గుంటూరు

గ్రామీణ ప్రాంతాల నుంచే 35శాతం బుకింగ్స్‌

మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ పర్యటనల బుకింగ్స్‌ బాగా పెరిగాయి. గతంలో ఐటీ ఉద్యోగులు, నగర వాసులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు బుకింగ్స్‌లో 35శాతానికిపైగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. ఈఎంఐ సదుపాయంతో ఎక్కువ మంది టూర్లపై ఆసక్తి చూపుతున్నారు.

- రాహుల్‌ శర్మ, సీనియర్‌ మేనేజర్‌, లీడింగ్‌ ట్రావెల్స్‌, హైదరాబాద్‌

Updated Date - Jul 13 , 2026 | 04:47 AM