Share News

బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:48 AM

దేశానికి స్వాతంత్య్రం లభించి 78 ఏళ్లు గడిచినా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన వాటా దక్కలేదని, గత పాలకులు బీసీలకు అన్యాయం చేశారని తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలి

  • జాతీయ ఓబీసీ సెమినార్‌లో తెలుగు ఎంపీలు

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం లభించి 78 ఏళ్లు గడిచినా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన వాటా దక్కలేదని, గత పాలకులు బీసీలకు అన్యాయం చేశారని తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ర్యాగ అరుణ్‌కుమార్‌, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్‌ అధ్వర్యంలో ఏపీ/తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియం లో జాతీయ ఓబీసీ సెమినార్‌ను నిర్వహించారు. తెలుగు ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, బీకే పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర, బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తీపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, పాక సత్యనారాయణ, మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు, టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్రశేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలో ప్రధానిని కలిసి బీసీలకు అన్ని రంగాల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని కోరతామన్నారు. రాజకీయంగా అత్యంత బలీయం గా ఉన్న ప్రధాని మోదీ హయాంలో బీసీలకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇంకెవరూ న్యాయం చేయలేరన్నారు. బీసీలకు రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక పథకం ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను జనాభా ప్రకారం ఇచ్చేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 31 , 2026 | 05:48 AM