తెలుగు మృత భాష కాదు... అమృతభాష
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:18 AM
తెలుగు మృతభాష కాదని, ప్రపంచవ్యాప్తంగా వికసిస్తున్న అమృత భాష అని వివిధ దేశాల నుంచి హాజరైన తెలుగు ప్రతినిధులు పేర్కొన్నారు..
ఓయూ తెలుగు సాహిత్య మహాసభలో విదేశీ ప్రతినిధులు
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు మృతభాష కాదని, ప్రపంచవ్యాప్తంగా వికసిస్తున్న అమృత భాష అని వివిధ దేశాల నుంచి హాజరైన తెలుగు ప్రతినిధులు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండవ తెలుగు సాహిత్య మహాసభ రెండోరోజైన మంగళవారం ఆర్ట్స్ కళాశాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించారు. పద్మవిభూషణ్ సంజీవ నరసింహ అధ్యక్షతన ‘‘దేశ విదేశాల్లో తెలుగు భాషావ్యాప్తికి జరుగుతున్న కృషి-మార్గదర్శనం’’ అంశంపై నిర్వహించిన సదస్సులో హాంకాంగ్‌కు చెందిన జయ పీసపాటి అక్కడ తెలుగు ఫెస్టివల్స్, తెలుగు బడి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. న్యూయార్క్ నుంచి వచ్చిన గూడూరు శ్రీనివాస్ తెలుగు లిటరరీ అసోసియేషన్ ద్వారా సాహిత్య ేసవలు చేస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమాలు 30 దేశాల్లో కొనసాగుతున్నాయని కల్వల విశ్వేశ్వర్ చెప్పారు. ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి వచ్చిన ప్రతినిధులు పిల్లల్లో మాతృభాషపై మమకారం పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ‘‘తెలుగు భాషా పరిశోధనలో శాస్త్ర సాంకేతిక సాధనాల వినియోగం’’ అంశంపై జరిగిన మరో సదస్సులో ఆధునిక సాంకేతికతతో తెలుగుభాషను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. సోషల్ మీడియా, వైరల్ సాహిత్యం, యువ రచయితల సాహిత్యం, సీనియర్ రచయితలపై యువత ఆశలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, తెలుగు సాహిత్య మహాసభ డైరెక్టర్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి.కాశీం, తెలుగు శాఖ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.