Share News

మొదటి విడతలోనే ప్రతి రైతుకూ భరోసా!

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:12 AM

రైతు భరోసా పథకాన్ని గతానికి భిన్నంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక రోజు ఎకరం వరకు, రెండోరోజు రెండెకరాలకు...

మొదటి విడతలోనే ప్రతి రైతుకూ భరోసా!

  • 70 లక్షల మంది ఖాతాలకు ఒకే రోజు నగదు బదిలీ

  • తొలిరోజు ఎకరం విస్తీర్ణం వరకు డబ్బుల చెల్లింపు.. ఐదెకరాలు పదెకరాలున్నా ఎకరానికి సాయం

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకాన్ని గతానికి భిన్నంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక రోజు ఎకరం వరకు, రెండోరోజు రెండెకరాలకు, మూడో రోజు మూడెకరాలకు... ఇలా ఆరోహణ పద్ధతిలో కాకుండా ప్రతి రైతుకు మొదటి రోజే పెట్టుబడి సాయం అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న విడుదలచేసే మొదటి విడతలో ఒకే రోజు 70 లక్షల మందికి రైతు భరోసా చెల్లిస్తారు. అంటే.. మొదటి రోజు ఎకరం విస్తీర్ణం వరకు నగదు బదిలీచేస్తారు. అంటే ఒక రైతుకు రెండెకరాలుంటే.. తొలి విడతలో ఒక ఎకరానికి రైతు భరోసా అందుతుంది. ఐదెకరాలున్నా, పదెకరాలున్నా.. ఒక ఎకరానికి రూ.6 వేలు తొలిరోజు రైతు భరోసా అందుతుంది. ఒక వేళ ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు... ఎంత భూమి ఉంటే ఆ లెక్క ప్రకారం రైతు భరోసా చెల్లిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. అంటే... రైతు భరోసా ఎన్ని విడతలుగా విడుదల చేసినా ప్రతిసారి అందరికీ ఎంతో కొంత ఆర్థికసాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. యాసంగి రైతు భరోసాను ఈనెల 22న ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే! మొదటి విడతగా ఈ నెల 22న ఒక ఎకరం వరకు రైతు భరోసా చెల్లిస్తామని, మూడు వారాల తర్వాత మళ్లీ ఏప్రిల్‌లో రెండో విడత, ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మూడో విడతలో మొత్తం చెల్లింపులు చేస్తామని షెడ్యూలు ప్రకటించింది. మొదటి రోజు ఒక ఎకరం వరకు చెల్లిస్తామంటే.. సున్న నుంచి ఒక ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే చెల్లించే పరిస్థితి ఇదివరకు ఉండేది. రెండో రోజు రెండెకరాల వరకు చెల్లిస్తామంటే.. ఒక ఎకరం నుంచి రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే చెల్లించేవారు. రాష్ట్రంలో 73.55 లక్షల మంది రైతులు(పట్టాదారులు)ఉంటే... సున్న నుంచి 1 ఎకరం భూమి ఉన్న రైతులు 28.58 లక్షల మంది ఉన్నారు. ఒక ఎకరం నుంచి 2 ఎకరాలున్న రైతులు 18.17 లక్షల మంది, 2 ఎకరాల నుంచి 3 ఎకరాలున్న రైతులు 10.89 లక్షలు, 3 ఎకరాల నుంచి 4 ఎకరాలున్న రైతులు 6.51 లక్షల మంది, 4 ఎకరాల నుంచి 5 ఎకరాలున్న రైతులు 4.50 లక్షల మంది ఉన్నారు. మిగిలిన రైతులకు 5 ఎకరాల కంటే ఎక్కువ భూవిస్తీర్ణం ఉంది. ఒకవేళ ఒక రైతుకు 1 ఎకరం 10 గుంటల భూమి ఉంటే... మొదటి విడతలో ఎకరానికి రూ. 6 వేలు, రెండో విడతలో 10 గుంటలకు రూ. 1,500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్క ప్రకారం 70 లక్షల మంది రైతులకు రూ. 3,590 కోట్ల పెట్టుబడి సాయం అందుతుంది. రెండో విడతలో రూ.2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిచింది.


ఎదురుచూపులు లేకుండా...:

గతంలో రైతు భరోసా చెల్లింపులు కొందరికి తొందరగా, మరికొందరికి ఆలస్యంగా అందేవి. ఉదాహరణకు ఒక ఎకరం వరకు మొదటిరోజు చెల్లిస్తే 10 ఎకరాలకు మించి ఉన్న రైతులకు చెల్లించటానికి 10 రోజుల నుంచి నెల రోజులు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. లక్షలాది మంది రైతులు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు. కొత్త పద్ధతితో అలాంటి పరిస్థితి ఉండదు. మొత్తం ఈపథకానికి రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి.

Updated Date - Mar 19 , 2026 | 04:12 AM