మూసీ తీరాన ఓంకారేశ్వరుడు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:38 AM
మూసీ నది అభివృద్థికి వేగంగా అడుగులేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ పనులకు శ్రీకారం చుడుతోంది. మూసీ చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో పాటు..
మంచిరేవుల వద్ద 8 ఎకరాల్లో భారీ ఆలయ నిర్మాణం
వ్యయం రూ.636 కోట్లు.. 100 ఫీట్ల శివుడి విగ్రహం
2 వేల వాహనాల సామర్థ్యం గల పార్కింగ్ స్థలం
నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ/నార్సింగ్, మార్చి27 (ఆంధ్రజ్యోతి): మూసీ నది అభివృద్థికి వేగంగా అడుగులేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ పనులకు శ్రీకారం చుడుతోంది. మూసీ చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో పాటు.. ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యమిస్తోంది. గండిపేట చెరువుకు దిగువన భారీ శివాలయం నిర్మాణానికి సంకల్పించింది. హైదరాబాద్ మహా నగరానికి తూర్పున కీసరలో రామలింగేశ్వరుడు కొలువుదీరగా.. ఇక పశ్చిమాన ఓంకారేశ్వరుడికి అధునాతనంగా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. గండిపేట మండలం మంచిరేవులలో ఉన్న వీరభద్రస్వామి-మచిలేశ్వర స్వామి ఆలయం పక్కనే 8ఎకరాల విస్తీర్ణంలో రూ.663కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం, ఇతర నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు మూసీ రీవర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ప్రణాళికలు రూపొందించింది. శనివారం సీఎం రేవంత్ రెండి ఆయా పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాలతో ఆలయ నిర్మాణ శైలిని ఖారారు చేశారు. మూసీనది వెంట వంద అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరభద్రస్వామి ఆలయ గుట్టపైకి తీగల వంతెన ఏర్పాటు, పార్కింగ్ కాంప్లెక్స్, రోడ్లు, ల్యాండ్‌స్కే్‌పలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆలయం వరకు విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు. ఆలయం వద్ద 2 వేల వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించనున్నారు. ఓంకారేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం 100 అడుగుల ఎత్తున ఉంటుంది. అందులో నుంచి లోపలికి వెళ్తే చుట్టూ సాంస్కృతిక కార్యక్రమాలకు, హోమాలు, పూజల నిర్వహణకు అవసరమైన మండపాలు ఉంటాయి. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపాన్ని నిర్మిస్తారు. అక్కడే ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు.. 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట గర్భాలయం తర్వాత ఓంకారేశ్వర స్వామి గర్భాలయమే పెద్దదిగా ఉండనుంది. రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణంలో వాడిన రాయిని ఇక్కడ వినియోగించనున్నారు. ఈ ఆలయానికి సమీపంలో గల మూసీనదిపై చెక్‌డ్యామ్‌ను నిర్మించనున్నారు. దీంతో మూసీలో నీళ్లు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. బోటింగ్‌తో పాటు ఇతర సౌకర్యాలను కల్పించడానికి ప్రణాళికలు చేపట్టారు. అధునాతనంగా అద్భుతమైన రీతిలో ఓంకారేశ్వరుడి ఆలయం రానుండడంతో ఈ ప్రాంతం చిన్న శ్రీశైలంగా వర్థిల్లే అవకాశముందని స్థానికులు అంటున్నారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాల చెంతనే..
గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని గుట్టపై 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటిది. ఆ పక్కనే 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం ఉండగా అందులో శివలింగాన్ని చాళుక్యులు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. మూసీని ఆనుకుని ఉన్న ఈ ఆలయంలో శివలింగం చేప ఆకారంలో ఉండడంతో మచిలేశ్వర్(హిందిలో మచిలి అంటే చేప)స్వామిగా భక్తులు కొలుస్తారు. మూసీ ఒడ్డున 110 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న సహజసిద్ధమైన గుహలో వెలసిన శివలింగం అత్యంత పురానతమైనది. భారీ సైజులో ఉండే శివలింగం చుట్టూ 39 చిన్న శివలింగాలు ఉంటాయి. ఇదే గుహలో వీరభద్రస్వామి విగ్రహం కూడా రమణీయంగా ఉంటుంది. ఆలయంలో భద్రకాళిదేవి, నంది ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గోల్కొండను పాలించిన అబ్దుల్ హసన్ తానీషా ఈ దేవాలయాన్ని పలుమార్లు సందర్శించారని, నాడు ప్రధానమంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు భక్తులుగా ఉండేవారని, ఈ ఆలయాన్ని జగద్గురువు శంకరాచార్య కూడా సందర్శించారని చెబుతారు. పరిసర ప్రాంతాల్లోని చాలా కుటుంబాలకు వీరభద్రుడు ఇంటి దేవుడు. పలు మార్వాడీ, అగర్వాల్ కుటుంబాలు కూడా వీరభద్రుడిని ఇష్టదైవంగా కొలుస్తారు.