రేపు యాదాద్రి క్షేత్రంలో..వేద పాఠశాలకు శంకుస్థాపన
ABN , Publish Date - May 22 , 2026 | 04:25 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు.
కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సమక్షంలో భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
కొండపై మరో 4 అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల ఇది
15 ఎకరాల్లో.. రూ.43.80కోట్ల వ్యయంతో నిర్మాణం
యాదాద్రి, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. కొండపై స్వామివారిని దర్శించుకోవటంతో పాటు దేవస్థానం ఆధ్వర్యంలో టెంపుల్ సిటీలో ఏర్పాటు చేస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కొండపై స్వామివారి కల్యాణ మండపం, కాలినడక భక్తుల మెట్ల మార్గానికి పై కప్పు, వాయువ్య దిశగా మాడవీధులకు మెట్లు, దీక్షాపరుల మండపం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్రసరస్వతి సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేదవిజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన వేదపాఠశాల నెలకొల్పాలని సంకల్పించారు. దానిలో భాగంగా స్వామివారు కొలువైన యాదగిరికొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్ట టెంపుల్‌సిటీ లేఅవుట్ వద్ద 15ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. రూ.43.80కోట్ల అంచనా వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం రూ.5కోట్లు కేటాయిస్తుండగా, మిగతా నిధులు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయోనిధి(సీజీఎఫ్) నుంచి కేటాయింపులు చేస్తున్నారు. ఆశ్రమ గురుకుల విద్యా బోధనా పద్ధతిలో 300 మంది విద్యార్థులకు, అందుకు అవసరమైన వేద బోధన అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అవసరమైన వసతులు ఏర్పాటుకానున్నాయి. సువిశాల బోధనా మందిరాలు, సమావేశ మందిరం, వసతి భవనాలు, భోజనం సిద్ధం చేయడానికి సువిశాలమైన వంటగది, హోమాలు, యాగాలకు ప్రత్యేకశాలలతోపాటు గోశాలను నిర్మించనున్నారు. ఇది తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేదపాఠశాలల్లో ఒకటిగా నిలవనుంది.
నేడు గుట్టకు విజయేంద్ర సరస్వతి
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్రసరస్వతిస్వామి సందర్శించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో లక్ష్మీనరసింహులను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొండపై గల కళావేదిక వద్ద 24మంది వేదపండితులు స్వామివారి సమక్షంలో వేదపారాయణాలు జరుపుతారు. ఆ తర్వాత భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తారు.
నాలుగు వేదాల బోధన
వేద పాఠశాలలో చేరే విద్యార్థులకు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలతో పాటు.. ఆగమ శాస్త్రాలను కూడా బోధిస్తారు.
పదేళ్లు అధ్యయనం పూర్తిచేసిన వారికి డిగ్రీతో సమానమైన సర్టిఫికెట్, 12 ఏళ్లు పూర్తి చేసిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)తో సమానమైన విద్యార్హతగా పరిగణిస్తారు. అలాగే ఐదేళ్ల పాటు అర్చక కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇది ఒక పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాల. దాదాపు 300 మంది విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
పాఠశాల ప్రాంగణంలో పెద్ద గోశాల, యజ్ఞశాల, విశాలమైన వంటశాల, సౌర విద్యుత్‌లో కూడిన ప్రహరీని నిర్మించనున్నారు.
కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో ఈ పాఠశాల నడవనుంది. తెలంగాణలోని ఆలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న మూడవ వేద పాఠశాల ఇది. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభం కానున్నాయి.