ఫ్యూచర్‌సిటీ-బందరు పోర్టు... కొత్త రోడ్డుకు బ్రేక్?
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:46 AM
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టు వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు బ్రేక్ పడే వాతావరణం కనిపిస్తోంది.
12 లేన్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదించిన తెలంగాణ.. అనుమతి కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ
6 లేన్లుగా హైదరాబాద్-మచిలీపట్నం హైవే
యాక్సిస్ కంట్రోల్ రోడ్డుగా చేస్తున్నాం
మచిలీపట్నం-బందర్ పోర్టుకు కొత్తరోడ్డు వేస్తాం
దాంతో విభజన చట్టం హామీ పూర్తయినట్లే
తెలంగాణ లేఖకు సమాధానమిచ్చిన కేంద్రం
ఏపీ సర్కారూ పాత రోడ్డుకే సుముఖం
అమరావతికి లింక్ రోడ్డు ఇవ్వాలని విజ్ఞప్తి
కేంద్రం నుంచి లేఖొచ్చి నెలకు పైనే
కొత్త రోడ్డు డీపీఆర్‌పైనే తెలంగాణ కసరత్తు
స్మార్ట్ హైవేగా హైదరాబాద్-విజయవాడ రోడ్డు
ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ నియంత్రణ
విస్తరణకు పదివేల కోట్లతో అంచనా
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టు వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు బ్రేక్ పడే వాతావరణం కనిపిస్తోంది. ఈ రోడ్డు అనుమతులపై కేంద్రం ఎటూ తేల్చకుండా హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే గురించి మాట్లాడుతోంది. నాలుగు వరుసలుగా ఉన్న ఆ రోడ్డును ఆరు వరసలకు విస్తరించి, యాక్సిస్ కంట్రోల్ హైవేగా తీర్చిదిద్దనున్నామని, మచిలీపట్నం నుంచి బందర్ పోర్డుకు కొత్త రోడ్డు వేస్తామని, దాంతో విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినట్లేనని ప్రకటించింది. కొత్త రోడ్డుకు కేంద్రం అడ్డంగా నో చెప్పకపోయినా పాత రోడ్డు ప్రస్తావన చేయడం ద్వారా కొత్త రోడ్డుకు బ్రేక్ వేసే ఉద్దేశాన్ని వ్యక్తం చేసిందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి గుంటూరుల మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోడ్డుకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖను అందించారు.
ఇప్పుడు ఆ గ్రీన్‌ఫీల్డ్ హైవే అవసరం లేదన్న భావన స్ఫురించేలా కేంద్రం గత నెల 9న రాష్ట్రానికి లేఖ రాసింది. ఆ లేఖ ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. ‘‘హైదరాబాద్-అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుమతిని ఇవ్వాలని మీరు లేఖ రాశారు. మేము ప్రస్తుతం 4 వరుసలతో ఉన్న హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)ని 6 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించాం. దానిని పూర్తి యాక్సెస్ కంట్రోల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నాం. డీపీఆర్ తయారవుతోంది. మచిలీపట్నం నుంచి బందర్ పోర్టు వరకు 6 వరుసల్లో కొత్త రోడ్డు నిర్మించేందుకు గత జనవరిలోనే అనుమతి ఇచ్చాం. ఈ పనులన్నీ పూర్తయితే హైదరాబాద్-విజయవాడ/అమరావతి-మచిలీపట్నం మధ్య హైస్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఆ రాష్ట్రంలో హైవే కారిడార్లను అభివృద్ధి చేసి ప్రధాన నగరాలతో, పోర్టులతో కనెక్టివిటీ కల్పించడం పూర్తవుతుంది’’ అని పేర్కొంది. తెలంగాణ ప్రతిపాదిస్తున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే అవసరం లేదన్నట్టుగా కేంద్రం భావిస్తోందన్నట్లు ఈ లేఖ భావం స్ఫురిస్తోంది. దీనికి అదనంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేను అనుమతిస్తారా? లేదా? అని కూడా చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం రాస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఒక కాపీని ఏపీ సర్కారుకు కూడా పంపింది.
కొనసాగుతున్న కొత్త రోడ్డు డీపీఆర్
హైదరాబాద్-విజయవాడ హైవే ట్రాఫిక్ భారీగా పెరుగుతుందన్న అంచనాతో ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్రంతో చర్చలు జరుపుతోంది. ప్రాథమిక రూట్ మ్యాప్‌ను కూడా రూపొందించింది. తెలంగాణలో 40, ఏపీలో 60 కలిపి మొత్తం 100 గ్రామాల పక్క నుంచి 297 కిలోమీటర్ల హైవే ప్రతిపాదించారు. భూసేకరణ, నిర్మాణ ఖర్చు రూ.20 వేల కోట్ల వరకు అవుతాయని అంచనా వేశారు. ప్రాథమిక నివేదిక తుదిదశకు చేరుకుంటున్న తరుణంలో కేంద్రం ఫిబ్రవరి 9న ఈ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖను పక్కనబెట్టి గ్రీన్‌ఫీల్డ్ హైవే డీపీఆర్‌పై ముందుకే వెళుతోంది. నిజానికి కొత్త రోడ్డు విషయంలో మొదట్లో కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్-విజయవాడ విస్తరణ డీపీఆర్‌ను రూపొందిస్తున్న కన్సల్టెంట్‌కే గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాథమిక పరిశీలన బాధ్యతను అప్పగించింది. ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల అధికారులు సీఎంతో సమావేశంలో ప్రస్తావించారు. అలైన్‌మెంట్ అధ్యయనం, టెరైన్ అధ్యయనం, ప్రత్యామ్నాయాల అధ్యయనం ఈ కన్సల్టెన్సీ చేస్తోందని వివరించారు. కేంద్రం ఇవన్నీ చేస్తూ, అనూహ్యంగా ఇప్పుడు పాత రోడ్డు విస్తరణతో సరిపెట్టడం చర్చనీయాంశమైంది. కేంద్రం లేఖపై రాష్ట్రప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ హైవేను మంజూరు చేయించుకొనే అవకాశాలను పరిశీలిస్తోంది.
అమరావతికి లింకు రోడ్డు ఇవ్వండి
కేంద్రం తెలంగాణకు రాసిన లేఖ ప్రతినే ఏపీకి కూడా పంపిన నేపథ్యంలో ఏపీ కూడా కేంద్రం లేఖలోని అంశంపైనే దృష్టి పెట్టింది. విస్తరిస్తున్న పాత రోడ్డు నుంచి అమరావతికి కేంద్రం నిధులతో లింక్ రోడ్డు ఇవ్వాలని అడుగుతోంది. హైదరాబాద్-విజయవాడ హైవే ఏపీలోకి ప్రవేశించిన తర్వాత ఏదో ఒక పాయింట్ నుంచి అమరావతికి లింక్ రోడ్డు వేయాలని కోరుతోంది. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
విస్తరణకు పదివేల కోట్లు
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్రం ఏకంగా పదివేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పరిధిలోని దండు మల్కాపురం ఆంధోల్ మైసమ్మ ఆలయం నుంచి ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు 231 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరిస్తారు. ఇందుకోసం రూ.10,391 కోట్లు అంచనా వేశారు. నిర్మాణ వ్యయం రూ.6,775 కోట్లు కాగా ఇతర అవసరాలకు రూ.3,616 కోట్లు పెడతారు. రెండు రాష్ట్రాల్లో అవసరం అయినచోట భూసేకరణ జరుపుతారు. స్మార్ట్ హైవేగా నిర్మించాలని నిర్ణయించారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్‌కు ఒకటిచొప్పున స్మార్ట్ ఏఐ కెమెరాలు అమరుస్తారు. 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్ధిక కారిడార్లకు, మరో 2 టెక్స్‌టైల్ క్లస్టర్లకు అనుసంధానంగా రోడ్డు నిర్మాణం ఉంటుంది. 17 చోట్ల బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దుతారు. ఇంత భారీగా ఖర్చు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కేంద్రం పునరాలోచనలో పడిందని, అందుకే ఈవిధంగా లేఖ రాసిందని అధికారులు భావిస్తున్నారు.