Share News

తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్‌ బకాయిల వివాదం తేల్చలేం

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:20 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల వివాదంలో దాఖలైన పిటిషన్‌ను పక్కనపెడుతూ తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్‌ బకాయిల వివాదం తేల్చలేం

  • కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఈఆర్‌సీ నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల వివాదంలో దాఖలైన పిటిషన్‌ను పక్కనపెడుతూ తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి వీలుగా ఆయా సంస్థలను దివాళా తీసినట్లుగా ప్రకటించి, బకాయిలు ఇప్పించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఏపీ జెన్‌కో, ప్రభుత్వం కేసులు వేసిన విషయం విదితమే. ఈ కేసులో తీర్పు వెలువడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఈఆర్‌సీలో పిటిషన్‌ వేశాయి. అయితే ఆ తర్వాతి క్రమంలో ఏపీ ఎన్‌సీఎల్‌టీలో కేసును వెనక్కితీసుకుంది. ఈ క్రమంలో ఏపీకి చెల్లింపులు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వగా.. వీటిని సవాలు చేస్తూ హైకోర్టులో తెలంగాణ కేసు వేయగా.. కేంద్రం ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏపీ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ అంశాల ఆధారంగా ఎన్‌టీసీఎల్‌లో కేసు లేకపోవడం.. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేస్తూ శుక్రవారం ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

Updated Date - Aug 29 , 2026 | 04:22 AM