Share News

కాంగ్రెస్‌ వైపే తెలంగాణ యువత

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:05 AM

తెలంగాణలో యువత కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పార్టీ అధిష్ఠానానికి తెలిపారు. బీఆర్‌ఎ్‌సకు వారు పూర్తిగా దూరవుతున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌ వైపే తెలంగాణ యువత

  • బీఆర్‌ఎస్‌కు దూరంగా నవతరం.. బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదు

  • ‘సంఘటన్‌ సృజన్‌’ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి

  • ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా వ్యవహరించండి

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచన

  • తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుందంటూ కితాబు!

  • కాంగ్రెస్‌ వైపే తెలంగాణ యువత

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో యువత కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పార్టీ అధిష్ఠానానికి తెలిపారు. బీఆర్‌ఎ్‌సకు వారు పూర్తిగా దూరవుతున్నారని చెప్పారు. ఇక తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక వాతారవణాన్ని బట్టి యువత బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదన్నారు. ఏఐసీసీ చేపట్టిన ‘సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. సీఎంతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుత తరుణంలో యువతను, విద్యార్థులను కాంగ్రెస్‌ కు అనుకూలంగా మలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి పటిష్టం చేయాలని, ఖాళీగా ఉన్న డీసీసీలను భర్తీ చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ సమయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్‌ ఓటర్లను తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి పటిష్ఠంగానే ఉందని వేణుగోపాల్‌ కితాబిచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో యువత పెద్దఎత్తున అనుకూలంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో సీజేపీ ధర్నా జరిగినప్పుడు వారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించిన విషయాన్ని తెలిపారు. యువతకు 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.


కాగా, తెలంగాణ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు తాను, సమన్వయ కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క సహా అందరూ హాజరవుతారన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ నేతృత్వంలో ఎస్‌ఐఆర్‌ అంశంపై ఈ సమావేశంలో మరోసారి సమగ్రంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పనితీరు, పార్టీ కార్యకలాపాలపై కేసీ వేణుగోపాల్‌ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో యువతకు సైతం తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 06:07 AM