Share News

రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:28 AM

తెలంగాణలోని యువతలో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • జర్మనీలో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో మంత్రి వివేక్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని యువతలో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలోని ఎర్లాంజెన్‌ నగరంలో ‘టైగర్‌ ఇ.వి. ఎర్లాంజెన్‌’, ‘జర్మనీలో తెలంగాణోళ్లం’ సంస్థల సంయుక్తాధ్వర్యంలో శనివారం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి వివేక్‌తోపాటు బవేరియా రాష్ట్ర హోం, స్పోర్ట్స్‌, ఇంటిగ్రేషన్‌ శాఖ మంత్రి జోయాకిం హెర్మన్‌, ఎర్లాంజెన్‌ మేయర్‌ జోర్గ్‌ వోలెత్‌, తెలంగాణ ప్రవాసులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలపై దాదాపు రూ.131 కోట్లతో ‘టామ్‌కామ్‌’ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. ఇందులో కార్యక్రమ నిర్వాహకులు కిరణ్‌కుమార్‌ వంగప ల్లి, సుహాస్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, బెర్లిన్‌లో శుక్రవారం మంత్రి వివేక్‌ భారత రాయబారి అజిత్‌ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్మనీలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం జర్మనీలో 3.11లక్షల మంది భారతీయులున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 04:28 AM