ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో తెలంగాణ యువకుడికి 24వ ర్యాంక్
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:11 AM
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో గ్రూప్-బీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించిన సీజీఎల్..
హుజూర్‌నగర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో గ్రూప్-బీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించిన సీజీఎల్(కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్)-2025 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన వట్టె సాయికుమార్ ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయి కుమార్ 2023లో కస్టమ్స్ అధికారిగా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ సీజీఎల్-2025కు సిద్ధమైన సాయి కుమార్ ప్రతిభ కనబరిచారు. సాయికుమార్‌తోపాటు రాష్ట్రానికి చెందిన మరికొందరు కూడా సీజీఎల్-2025లో సత్తాచాటారు. కాగా, సీజీఎల్-2025కు సంబంధించిన నోటిఫికేషన్ గతేడాది వెలువడగా.. 2025 సెప్టెంబరు 12 నుంచి 26 వరకు టైర్-1, జనవరి 18,19 తేదీల్లో టైర్-2 పరీక్షను నిర్వహించారు. మొత్తం 36.70 లక్షల మంది పోటీ పడగా, తుది జాబితాలో 15,118 మంది చోటు సంపాదించుకున్నారు. ఈ మేరకు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను కమిషన్ ప్రకటించింది. 390 మార్కులకు గాను అన్‌రిజర్వుడ్‌లో 309, ఓబీసీలో 308, ఈడబ్ల్యూఎ్‌సలో 308, ఎస్సీలో 293, ఎస్టీలో 277 మార్కులను కనీస కటా్‌ఫగా ప్రకటించారు. అఖిల భారత స్థాయిలో ధృవ్‌రాణా 1వ ర్యాంకు, మోహిత్ కుమార్ 2వ ర్యాంకు, నూకల రాంచరణ్ 3వ ర్యాంకు సాధించారు.