Share News

మీ పిల్లల్ని అమెరికా పంపొద్దు!

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:27 AM

తన సోదరుడిని హత్య చేసేందుకే పిజ్జా కోసం నకిలీ ఆర్డర్‌ పెట్టారని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో హత్యకు గురైన తెలంగాణకు చెందిన కుంచ అన్షుల్‌(28) సోదరి తన్వి ఆరోపించారు.

మీ పిల్లల్ని అమెరికా పంపొద్దు!

  • తల్లిదండ్రులకు అమెరికాలో హత్యకు గురైన అన్షుల్‌ సోదరి విజ్ఞప్తి

  • అతడిని హత్య చేసేందుకే పిజ్జాకు ఆర్డర్‌ పెట్టారని వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 7 : తన సోదరుడిని హత్య చేసేందుకే పిజ్జా కోసం నకిలీ ఆర్డర్‌ పెట్టారని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో హత్యకు గురైన తెలంగాణకు చెందిన కుంచ అన్షుల్‌(28) సోదరి తన్వి ఆరోపించారు. తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను అమెరికా పంపవద్దని ఆమె భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ఎవరూ లేని ఇంటి వద్దకు పిజ్జా డెలివరీకి వచ్చేలా చేసి తన సోదరుడిని హత్య చేశారని ఆమె ఆదివారం మీడియా వద్ద వాపోయారు. అతడిని చంపేందుకే ఈ పని చేశారని పేర్కొన్నారు. అయితే ఎందుకు చేశారో తెలియదని, దాని వల్ల వారికి ఏం లాభమో తెలియదని చెప్పారు. తన సోదరుడు ఎంతో మంచివాడని, తమతో ఎంతో ప్రేమగా ఉండేవాడని పేర్కొన్నారు. అతడికి అమెరికా వెళ్లే ఉద్దేశం లేకపోయినా తామే బలవంతంగా అక్కడికి పంపామని పేర్కొన్నారు. దానివల్ల ఏం జరిగిందో చూడండని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దయ చేసి ఎవరూ మీ పిల్లల్ని అమెరికా పంపవద్దు అని ఆమె తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తన సోదరుడు నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడని తన్వి చెప్పారు. అతడి మృతదేహాన్ని సత్వరం స్వదేశానికి పంపే లా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. హత్యపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని, అయితే అందుకు కారకులను గుర్తించి శిక్షించాలని కోరారు. కాగా నిందితులను పట్టించే సమాచారం ఇచ్చిన వారికి 20,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ఫిలడెల్ఫియా పోలీసు లు ప్రకటించారు. పిజ్జాకు ఆర్డర్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నెంబరును గుర్తించారు. అతడికి ఈ హత్యతో సంబంధం ఉందా? లేదా?అని నిర్ధారించే పనిలో ఉన్నారు. కాగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ఈ ఘటన ఎంతో విచారకరమని ‘ఎక్స్‌’లో పేర్కొంది. అన్షుల్‌ కుటుంబానికి సంతాపం తెలియజేసింది. తాము ఈ ఘటనపై అమెరికాలోని స్థానిక అధికారులను సంప్రదిస్తున్నామని, బాధిత కుటుంబంతోనూ మాట్లాడామని అవసరమైన సహాయం అందజేయనున్నట్లు పేర్కొంది.

Updated Date - Jun 08 , 2026 | 06:29 AM