Berlin incident: జర్మనీలో తెలంగాణ యువకుడి మృతి
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:17 AM
జర్మని రాజధాని బెర్లిన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన తోకల హృతిక్‌రెడ్డి (26) అనే యువకుడు మరణించాడు.
అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో నాలుగో అంతస్తు నుంచి దూకి మృత్యువాత
చిలుపూర్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జర్మని రాజధాని బెర్లిన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన తోకల హృతిక్‌రెడ్డి (26) అనే యువకుడు మరణించాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిలుపూర్ మండలంలోని మల్కాపూర్‌కు చెందిన తోకల సంపత్‌రెడ్డి - కరుణ దంపతుల ఏకైక కుమారుడు హృతిక్‌రెడ్డి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం రెండున్నరేళ్ల క్రితం బెర్లిన్ వెళ్లాడు. అక్కడి ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, సోమవారం రాత్రి పది గంటల సమయంలో (జర్మనీ కాలమాన ప్రకారం) ఆ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భవనమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు హృతిక్ రెడ్డి తాము ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణ వార్త తెలుసుకొని రోహిత్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాగా, హృతిక్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. జర్మనీ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.