అమెరికా ఏవియేషన్ రంగంలో తెలంగాణ యువకుడి ఘనత
ABN , Publish Date - May 25 , 2026 | 04:55 AM
అమెరికా విమానయాన రంగంలో తెలంగాణ యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన కుదురుమల్ల అరుణ్‌కుమార్‌రెడ్డి ....
ఓఏఏ బోర్ట్ ఆఫ్ డైరెక్టర్లలో అరుణ్‌కుమార్‌రెడ్డికి స్థానం
పరిగి, మే 24 (ఆంధ్రజ్యోతి): అమెరికా విమానయాన రంగంలో తెలంగాణ యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన కుదురుమల్ల అరుణ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఓహియో ఏవియేషన్ అసోషియేషన్’ (ఓఏఏ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దోమ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, మాజీ సర్పంచి కె.రాజిరెడ్డి పెద్ద కుమారుడైన అరుణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కేశవరెడ్డి స్కూల్‌లో, ఇంటర్‌ను చైతన్య కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం తెలంగాణ ఏవియేషన్ అకాడమిలో ఇంజనీరింగ్ కోర్సు ముగించారు. ఎంఎస్ కోసం అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గల ‘కెంట్ స్టేట్ యూనివర్సిటీ’లో చేరిన ఆయన, పీజీ పూర్తి కాకముందే అక్కడి ‘విస్టా ఎయిర్‌వేస్’ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. చేరిన ఏడాదిలోనే విమాన విడిభాగాల విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సంస్థ నిర్వహించిన అంతర్గత ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం విస్టా అమెరికా సంస్థలో మెయింటెన్స్ ప్రోగ్రాం మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్‌కుమార్‌రెడ్డి, 2029 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఎంతో గర్వంగా ఉంది: కె.అరుణ్‌కుమార్‌రెడ్డి
ప్రపంచ ఏవియేషన్ రంగంలో అత్యంత కీలకమైన సంస్థ బోర్డులో స్థానం లభించడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని అరుణ్‌కుమార్ రెడ్డి అన్నారు. చిన్నప్పటి నుంచే ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని, కష్టపడి చదివి ఈ గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మన భారతీయులు, ముఖ్యంగా తెలుగు యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటాలని కోరుకుంటున్నానని చెప్పారు.