కేంద్రంపై భగ్గుమన్న కార్మిక లోకం
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:07 AM
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కార్మిక వర్గాన్ని కట్టుబానిసగా మార్చేందుకు కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదంతొక్కారు.
సార్వత్రిక సమ్మె సక్సెస్.. హైదరాబాద్, పలు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
4 లేబర్ కోడ్‌ల రద్దుకు డిమాండ్
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
కార్మికుల హక్కులను తాకట్టు పెడుతున్న కేంద్రం: టీపీసీసీ చీఫ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కార్మిక వర్గాన్ని కట్టుబానిసగా మార్చేందుకు కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదంతొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ ర్యాలీలో కార్మికులు, రైతులు, కూలీలు, ఉద్యోగులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి కార్మిక వర్గం ఒక రోజు వేతనాలు సుమారు రూ.10 కోట్లు నష్టపోయింది. సింగరేణివ్యాప్తంగా కార్మికులు గనుల వద్ద, రహదారులపై నిరసన తెలిపారు. ఖమ్మం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లోనూ కార్మికులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కార్మికుల సమ్మెకు వామపక్షాలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. సికింద్రాబాద్‌లో దూర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ వైపు వచ్చే ఆటోలను నిరసనకారులు దారి మధ్యలోనే ఆపేసి ప్రయాణికులను దింపేశారు. హైదరాబాద్‌తో పాటు చాలాచోట్ల పారిశుద్ధ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్తకుప్పలు, వ్యర్థాలు పేరుకుపోయాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి జోన్‌లో పారిశుధ్య కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లతో పాటు విద్యుత్, విత్తన సవరణ బిల్లులు, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తేవడం ద్వారా కోట్లాది మంది కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఆరోపించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి దేశంలో 33 కోట్ల మంది రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీల నోటి కాడి బుక్క లాగేసుకుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల కష్టం, స్వేదంతోనే దేశం నిర్మాణమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాశ్చాత్య దేశాల ముసుగులో కార్మికులు, కర్షకులకు అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి కార్మిక చట్టాలను, కార్మికుల హక్కులను అంబానీ, అదానీ, విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందన్నారు. దేశీయ పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను ఫణంగా పెట్టేలా ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండకూడదని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే మన దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని, మన రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు.