Share News

నేటి నుంచి మహిళా వారోత్సవాలు: సీతక్క

ABN , Publish Date - May 25 , 2026 | 05:11 AM

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.

నేటి నుంచి మహిళా వారోత్సవాలు: సీతక్క

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహిళలను సంక్షేమ పథకాల లబ్థిదారుల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా, సంపద సృష్టికర్తలుగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వారోత్సవాల సందర్భంగా 25న గ్రామ, మండలస్థాయిలో 8 వేల ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపనలు, 26న మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27న సోలార్‌ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29న ఇంక్యుబేటర్‌ ప్రోగ్రామ్‌, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. 30న ‘అమ్మకు అక్షరమాల’ ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా, మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31న ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు.

Updated Date - May 25 , 2026 | 05:11 AM