Share News

మహిళా రైతుల కృషి మరువలేనిది

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:14 AM

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కృషి జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

మహిళా రైతుల కృషి మరువలేనిది

  • వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం

  • రెండేళ్లలో రైతులు, తెలంగాణ ఆదాయం పెంపు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు

  • మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల

రాజేంద్రనగర్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కృషి జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయంలో మహిళా రైతాంగం కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సహకారంతో రెండు రోజులు నిర్వహిస్తున్న మెగా మహిళా రైతు మేళాను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రెండేళ్ల రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను కాపాడుకోవడానికి, రైతు ఆదాయం, తెలంగాణ ఆదాయాన్ని పెంచడానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణ మాఫీ చేశామని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ..సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని రైతులు ముందుకు సాగాలన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల యూరియా, పప్పు దినుసుల ధరలపై ప్రభావం ఉండే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరాలన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తోందని, రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.36వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించినట్టు తెలిపారు. వ్యవసాయంలో విత్తనం నాటే నుంచి మార్కెట్‌ వరకు మహిళలు కష్టపడుతుంటారని, అయినా వారికి సరైన గుర్తింపు లభించడంలేదన్నారు. ప్రతి రంగంలో మహిళల పట్ల వివక్షత కనిపిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని, సంవత్సరం పొడవునా మహిళా రైతులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.


కాగా కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 200 మంది మహిళా రైతులకు డ్రోన్లను అందచేసినట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ సుబ్రమణ్యం, వైస్‌ ప్రెసిడెంట్‌ జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. మెగా రైతు మేళాలో 25 మంది అభ్యుదయ మహిళా రైతులకు అవార్డులు అందజేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజ్య తండాకు చెందిన టమాట మహిళా రైతు రమావత్‌ సుగుణ ఐదారుఎకరాల్లో టమాట పండిస్తూ రూ.5లక్షల వరకు ఆదాయం పొందడంతో ఆమెకు అవార్డు అందజేశారు. నల్గొండ జిల్లా లెంకలపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఎర్పుల సుగుణమ్మ బంతిపూలు సాగు చేస్తూ 120 రోజులకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నందుకు అవార్డును అందజేశారు. సంగారెడ్డి జిల్లా జరసంగి మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన కె.మొగిలమ్మ చిరుధాన్యాల రైతు, డక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సహకారంతో ఐదు వేల మంది మహిళా రైతులకు ప్రతినిధిగా ఉన్నారు. చిరుధాన్యాలు పండించినందుకు ఇప్పటి వరకు అనేక అవార్డులు పొందారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డు అందజేశారు. ఉత్తమ జర్నలిస్టులుగా లక్ష్మీ(ఏబీఎన్‌), మల్లిక్‌(ఈటీవీ), నరేశ్‌(వీ6) అవార్డులు పొందారు. సమావేశంలో ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మంగీలాల్‌ జాట్‌, ఉద్యానశాఖ డైరెక్టర్‌ యాస్మీన్‌ బాష, జయశంకర్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 04:15 AM